తెరాసలోకి నటుడు సుమన్?

May 05, 2017


img

ప్రముఖ తెలుగు సినీ నటుడు సుమన్ నిన్న ప్రగతి భవన్ కు వెళ్ళి ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలుసుకొన్నారు. సుమారు 15 నిమిషాలపాటు వారు మాట్లాడుకొన్నారు. సుమన్ అకస్మాత్తుగా ముఖ్యమంత్రిని కలవడానికి కారణం ఏమిటో ఇంకా తెలియదు కానీ కొన్ని రోజుల క్రితమే తాను వచ్చే ఎన్నికలలోగా ప్రత్యక్ష రాజకీయాలలోకి రావాలనుకొంటున్నట్లు చెప్పారు. కనుక ఆయన తెరాసలో చేరే ఆలోచనతోనే ముఖ్యమంత్రిని కలిశారేమోననే సందేహం కలుగుతుంది. తెరాసలో ఎవరైనా చేరవచ్చు కానీ ప్రస్తుతం ఆ పార్టీ ‘హౌస్ ఫుల్’ అయినందున ఎన్నికలలో టికెట్స్ ఆశించి జేరాలనుకొంటే ఆశాభంగం తప్పకపోవచ్చు. 

కర్నాటకలో పుట్టి తమిళనాడులో పెరిగిన సుమన్ తెలుగు సినిమాలే ఎక్కువగా చేశారు. తెలుగు తరువాత తమిళ, కన్నడ, మలయాళ బాషలలో కూడా అనేక సినిమాలు చేశారు. దశాబ్దాలుగా తెలుగు ప్రజలతో ఉన్న అనుబందం కారణంగా ఆయన తెలుగు రాష్ట్రాల నుంచే రాజకీయ ప్రవేశం చేయాలనుకొంటునట్లున్నారు. నటులు సినిమాలు చేసుకొంటుంన్నంత కాలం వారిని సమాజంలో అన్ని వర్గాల ప్రజలు ఆదరిస్తారు. అభిమానిస్తారు. కానీ ఒకసారి ఏదైనా రాజకీయ పార్టీలో ప్రవేశిస్తే, అంత వరకు ‘అందరివాడు’గా ఉన్న ఆ నటుడు అప్పటి నుంచి ‘కొందరివాడు’గా మారిపోతాడు. స్వర్గీయ ఎన్టీఆర్, చిరంజీవి, పవన్ కళ్యాణ్ వంటివారు అందుకు నిదర్శనంగా ఉన్నారు. నటులు రాజకీయాలలో ప్రవేశిస్తే అప్పుడు వారికి కూడా రాజకీయ శత్రువులు ఏర్పడతారు. నిత్యం ఏదో ఒకవర్గం నుంచి విమర్శలు కూడా ఎదుర్కోవలసి ఉంటుంది. రెండు తెలుగు రాష్ట్రాలలో కొంత రాజకీయ శూన్యత ఉన్నప్పటికీ, ప్రధాన పార్టీలలో హౌస్ ఫుల్ బోర్డులే కనబడుతున్నాయి. కనుక సుమన్ కాస్త ఆలోచించుకొని అడుగు ముందుకు వేస్తే మంచిదేమో?


Related Post