మన ఇస్రో పేద దేశాల పాలిట దేవత

May 05, 2017


img

అంతరిక్ష రంగంలో ఇప్పటికే అనేక అద్భుతాలు సృష్టించిన భారత అంతరిక్ష ప్రయోగ సంస్థ (ఇస్రో) ఈరోజు మరో ప్రయోగానికి సిద్దం అవుతోంది. భారత్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, మాల్దీవులకు ఉపయోగపడే వీశాట్-9 అనే 2230 కేజీలు బరువున్న కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని శుక్రవారం సాయంత్రం సరిగ్గా 4.57గంటలకి అంతరిక్షంలో ప్రవేశపెట్టబోతోంది. ఈ ఉపగ్రహం కాలపరిమితి 12 ఏళ్ళు. శ్రీహరి కోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి జి.ఎస్.ఎల్.వి. విమాన వాహక నౌక ద్వారా దీనిని అంతరిక్షంలో 36,000 కిమీ ఎత్తులో భూస్థిర కక్ష్యలో ప్రవేశపెట్టబోతోంది. గురువారం మధ్యాహ్నం దీనికి కౌంట్ డౌన్ మొదలుపెట్టారు. ఒకేసారి 108 ఉపగ్రహాలను అంతరిక్షంలో ప్రవేశపెట్టి ప్రపంచంలో సరికొత్త రికార్డు సృష్టించిన ఇస్రోకి ఈ బారీ ఉపగ్రహాన్ని అంతరిక్షంలో ప్రవేశపెట్టడం పెద్ద కష్టమైన పనేమీ కాదనే చెప్పాలి.

పొరుగునున్న పాకిస్తాన్ తీవ్రవాదం అభివృద్ధిలో ప్రపంచంలో నెంబర్: 1 స్థానం సంపాదించుకొంటే, భారత్ అంతరిక్ష రంగంలో నెంబర్: 1 స్థానం సంపాదించుకోవడం మనందరికీ గర్వకారణం. ఇస్రో సాధించిన ఈ అద్భుతమైన సాంకేతిక ప్రగతి కేవలం భారతదేశానికే కాకుండా ఇరుగుపొరుగు చిన్న, పేద దేశాలకు ఈవిధంగా ఉపకరిస్తుండటం మరో గొప్ప విషయం. బారీ వ్యయంతో కూడిన అంతరిక్ష సంస్థను ఏర్పాటు చేసుకొని అంతకంటే ఖరీదైన అంతరిక్ష ప్రయోగాలు చేయడం భూటాన్, నేపాల్, శ్రీలంక వంటి దేశాలకు కష్టం కనుక అటువంటి చిన్న చిన్న దేశాల పాలిట మన ఇస్రో దేవతగా నిలుస్తోంది. అంతే కాదు..అమెరికా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, జపాన్, జర్మనీ వంటి అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఇస్రో సేవలను ఉపయోగించుకోవడం మరో విశేషం. ప్రపంచంలో పేద, ధనిక, చిన్నా పెద్దా అన్ని దేశాలకు మన ఇస్రో సేవలు అందించడం మనందరికీ గర్వకారణమే కదా! 


Related Post