వచ్చే ఎన్నికలలో తెరాసను డ్డీకొనేదెవరు?

May 04, 2017


img

రెండు తెలుగు రాష్ట్రాలలో అప్పుడే ఎన్నికల వాతావరణం వచ్చేసింది. తెరాస హామీలు, కొత్త పధకాలు చూస్తుంటే అది కూడా అప్పుడే ‘ఎన్నికల మోడ్’ లోకి వచ్చేసినట్లే కనబడుతోంది. కాంగ్రెస్ పార్టీ కూడా దానికి పోటీగా హామీలు గుప్పించడం మొదలుపెట్టింది. ఈ రేసులో తెదేపా, భాజపాలు వెనుకబడి ఉన్నాయి. 

వచ్చే ఎన్నికలలో ఒంటరిగానే పోటీ చేస్తామని భాజపా ప్రకటించేసింది కనుక ఆటోమేటిక్ గా తెదేపా ఒంటరి పోరాటమే చేయవలసి ఉంది. అప్పుడు తెలంగాణాలో తెదేపా, భాజపాలు కత్తులు దూసుకోదలిస్తే, ఏపిలో అవి మిత్రపక్షాలుగా కొనసాగుతునందున అక్కడ వాటికి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవవచ్చు. 

సింహం సింగిల్ గానే వస్తుందని తెరాస అంటోంది. కానీ మజ్లీస్ తో దోస్తి ఉండవచ్చు. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా ప్రస్తుతానికి ‘సోలో ఫైట్’ అనే అంటోంది. గడ్డాలు మీసాలు పెంచుకొని బాహుబలి వస్తాడని చెపుతోంది.

వచ్చే ఎన్నికలలో వామపక్షాలు ఎవరి తోక పట్టుకొని ఎన్నికల వైతరిణి ఈదుతాయో ఎన్నికలు దగ్గర పడితే గానీ తెలియదు. 

ఉత్తరాదిన భాజపాయేతర పార్టీలన్నీ కలిసి భాజపాను డ్డీకొంటున్నట్లే వచ్చే ఎన్నికలలో తెలంగాణా రాష్ట్రంలో కూడా తెరాస, భాజపాలను డ్డీకొనడానికి కాంగ్రెస్, తెదేపా, వామపక్షాలు, ఇంకా కొత్తగా రాబోతున్న జనసేన వంటి పార్టీలు చేతులు కలిపితే ఎలా ఉంటుంది? అని కాంగ్రెస్, తెదేపా నేతలు ఆలోచనలు చేస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వాటిలో నిజానిజాలు ఇంకా తేలవలసి ఉంది. 

ఒకవేళ తెలంగాణాలో కాంగ్రెస్, తెదేపా చేతులు కలిపినా లేదా లోపాయికారిగా ఒకరికొకరు సహకరించుకొన్నా, ఆంధ్రప్రదేశ్ లో అవి బద్ధ శత్రువులు గనుక ప్రత్యర్ధులు అడిగే ఇబ్బందికర ప్రశ్నలకు జవాబులు చెప్పవలసి వస్తుంది. 

ప్రస్తుతానికి తెలంగాణాలో తెరాసకు ఏకైక ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ ఒకటే కాస్త బలంగా కనబడుతోంది. కనుక ప్రధానంగా పోటీ వాటి మద్యనే ఉండవచ్చు. 

ఉత్తరాది రాష్ట్రాలలో వరుసగా విజయపతాకం ఎగురవేస్తున్నాము కనుక తెలంగాణాలో కూడా అవలీలగా గెలవగలమనే భ్రమలో భాజపా ఉంది. బహుశః వచ్చే ఎన్నికలలో తనకు బాగా అచ్చివచ్చిన ‘హిందూ ట్రంప్ కార్డు’ ను ఉపయోగించాలని అనుకొంటోందేమో? కారణం ఏదైనప్పటికీ, ఆ పార్టీ నేతలు చాలా ధీమా వ్యక్తం చేస్తుండటం విశేషం. రాష్ట్రపతి ఎన్నికల తరువాత సమీకరణాలపై కొంత క్లారిటీ వస్తుందేమో చూడాలి.


Related Post