తెలంగాణాకు సహకరిస్తే ఎన్డీయేకు సహకరిస్తాం

May 04, 2017


img

జూన్ 25వ తేదీతో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీ కాలం ముగుస్తుండటంతో ప్రతిపక్ష పార్టీలన్నీ ఒక బలమైన అభ్యర్ధిని నిలబెట్టి తమ సత్తా, ఐఖ్యత చాటుకోవాలని ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఎన్డీయే కూటమి కూడా తమ అభ్యర్ధిని నిలబెట్టి గెలిపించుకొనేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది కానీ ప్రతిపక్షాలు చేస్తున్నంత హడావుడి చేయడం లేదు. ఇటువంటి కీలక సమయంలో తెరాస ఎంపి జితేందర్ రెడ్డి ఎన్డీయేకు అనుకూలంగా ఒక ప్రకటన చేశారు. తెలంగాణాకు కేంద్రప్రభుత్వం సహకరించినట్లయితే తెరాస తప్పకుండా ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్ధికే మద్దతు ఇస్తుందని చెప్పారు. కానీ ఒకవేళ తెలంగాణాకు సహకరించకపోతే, ప్రతిపక్ష అభ్యర్ధికి మద్దతు ఈయడానికి వెనుకాడబోమని జితేందర్ రెడ్డి స్పష్టం చేశారు. 

ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్ధికి మద్దతు ఈయడానికి తెరాస సర్కార్ కేంద్రప్రభుత్వం నుంచి ఏమి ఆశిస్తోందో స్పష్టంగా చెప్పలేదు. ముస్లిం రిజర్వేషన్ బిల్లుకి ఆమోదం తెలుపడం, ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టుకి జాతీయ హోదా కల్పించడం, లేదా హైకోర్టు విభజన ప్రక్రియను మొదలుపెట్టడం వంటి కొన్ని డిమాండ్లు ఉన్నాయి. వాటిలో దేనికైనా కేంద్రప్రభుత్వం ఆమోదముద్ర వేయాలని కోరుతోందా లేక వేరే ఇతర డిమాండ్లు ఏమైనా ఉన్నాయా అనేది రానున్న రోజులలో స్పష్టమయ్యే అవకాశం ఉంది. ఒకవేళ రాష్ట్రపతి ఎన్నికల కారణంగా తెరాస-భాజపాల మద్య అనుబందం గట్టిపడితే వచ్చే ఎన్నికలలో అవి చేతులు కలిపినా ఆశ్చర్యం లేదు. 

ఇక ఇంతకాలం రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ స్వయంగా రంగంలోకి దిగి దేశంలో చిన్నా, పెద్ద ప్రతిపక్ష పార్టీల నేతలతో స్వయంగా మాట్లాడుతున్నారు. అందరూ కలిసి ఉమ్మడి అభ్యర్ధిని నిలబెట్టి గెలిపించుకోగలిగినట్లతే వచ్చే ఎన్నికలలో ఎన్డీయే కూటమిని ఎదుర్కొనేందుకు ఒక బలమైన శక్తిగా అవతరించవచ్చని ప్రతిపక్ష పార్టీల నేతలు భావిస్తున్నారు. కాంగ్రెస్ ప్రతిపాదనకు అందరూ సముఖంగానే ఉన్నారు కనుక అందరూ కలిసి తమ అభ్యర్ధి పేరును ఖరారు చేసుకోవలసి ఉంది.    


Related Post