ఆ మమకారం ఉన్న తెరాస అధికారంలో ఉంది గాబట్టే...

May 04, 2017


img

                                                            నందిని సిద్దారెడ్డి ఇంటర్వూ: 3వ భాగం 

అమెరికాలోని ఫిలడెల్ఫియా తెలంగాణా అసోసియేషన్ సభ్యులు “డయల్ యువర్ విలేజ్” పేరిట ఫోన్ కాన్ఫరెన్సింగ్ పద్దతిలో గత వారం ప్రముఖ రచయిత నందిని సిద్దారెడ్డి గారితో మాట్లాడినప్పుడు ఆయన తెరాస సర్కార్-తెలంగాణాలో మన బాష-సంస్కృతీ సంప్రదాయాల వాస్తవ పరిస్థితుల గురించి చాలా ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. ఆ వివరాలు:

“తెలంగాణా బాష, సంస్కృతి, ఆచార వ్యవహారాలపై చాలా మమకారం, మంచి పట్టు, అవగాహన ఉన్న కేసీఆర్ నాయకత్వంలో తెరాస సర్కార్ అధికారంలోకి వచ్చింది కనుకనే నేడు మన బాష, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు అవసరమైన బలమైన చర్యలు జరుగుతున్నాయని నేను భావిస్తున్నాను. ఒకప్పుడు ఆంధ్రాలో కాకినాడ లేదా బెజవాడ గురించో పాట్య పుస్తకాలలో చదువుకొనే పిల్లలు ఇప్పుడు మన రాష్ట్రం మన బాష, సంస్కృతి, సంప్రదాయాలు, మన పండుగలు, మన తెలంగాణా వీరుల గురించి చదువుకొంటున్నారంటే అందుకు వాటిపై ఆసక్తి కలిగిన ప్రభుత్వం అధికారంలో ఉండబట్టే కారణం కదా?

అలాగే కవులు, కళాకారులకు, సాహిత్యకారులకు, మేధావులకు తెరాస సర్కార్ ఉన్నంతలో సముచిత గౌరవం ఇస్తోందనే నేను భావిస్తున్నాను. అందుకే నేడు రసమయి బాలకిషన్, మామిడి హరికృష్ణ, శ్రీధర్, నా వంటివారు ప్రభుత్వంలో కనిపిస్తున్నారు. అయితే అన్ని కార్పోరేషన్లకు మేధావులు, కళాకారులు లేదా ఆయా రంగాలలో పనిచేసిన వారినే అధినేతలుగా నియమించడం సాధ్యం కాదు. రాజకీయ అవసరాలు, ఇతరత్రా కారణాల చేత రాజకీయ నేతలను కాదని మేధావులకే పదవులు అప్పగించడం అనేది ఏ ప్రభుత్వానికి సాధ్యం కాదని నా అభిప్రాయం,” అని అన్నారు. 

ఒకప్పుడు హైదరాబాద్ లో తెలంగాణా యాసలో మాట్లాడేందుకు ఎవరైనా కాస్త సంకోచించేవారేమో కానీ ఇప్పుడు ఎవరూ సంకోచించడం లేదు. ఎవరూ ఇదివరకులాగ ఆత్మన్యూనతా భావంతో ఎవరూ బాధపడటం లేదు. అందరూ ధైర్యంగా మేము తెలంగాణావాసులం...మాది తెలంగాణా బాష..మా పండుగలు ఇవి..అని ధైర్యంగా చెప్పుకొంటున్నారు. అందుకే ఇప్పుడు రవీంద్రభారతిలో మనకు అందరూ తెలంగాణాకు చెందిన కళాకారులే కనబడుతుంటారు. తెలంగాణాకు చెందిన సాంస్కృతిక కార్యక్రమాలే ఎక్కువగా జరుగుతుంటాయి. 

అసలు తెలంగాణాలో ఏమీ జరగడంలేదని అభిప్రాయం కలవారు ఈ చిన్న చిన్న మార్పులను గమనించడం చాలా అవసరం. అయితే మన సంస్కృతీ సంప్రదాయాలను ఇతరులు గుర్తించాలి..గౌరవించాలి అని కోరుకొంటునప్పుడు ముందు మనం వాటి గురించి అవగాహన, అభిమానం పెంచుకోవాలి. 

ఇప్పుడిప్పుడే ఆంధ్రాలో ప్రజలు కూడా తెలంగాణా బాష, యాసను అర్ధం చేసుకొనే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే మన సంస్కృతీ సంప్రదాయాలను గుర్తించి గౌరవిస్తున్నారు. ఇవన్నీ తెరాస అధికారంలో ఉండబట్టే సాధ్యం అయ్యిందని నేను భావిస్తున్నాను. అదే ఏ కాంగ్రెస్ పార్టీయో ఉండి ఉంటే మన బాష, యాస, సంస్కృతీ సంప్రదాయాలకు అంత ప్రాధాన్యత ఇచ్చి ఉండేది కాదేమో?  

నేటికీ తెలుగు సినిమాలలో తెలంగాణా బాష పట్ల కొంతః చులకన భావం కనిపిస్తున్న మాట వాస్తవం. కానీ ఇదివరకుతో పోలిస్తే ఇప్పుడు అది బాగా తగ్గిందని చెప్పవచ్చు. నేడు ఎవరూ తెలంగాణా బాష, సంస్కృతిని ఎద్దేవా చేసే విధంగా సినిమాలు తీసే సాహసం చేయగలరని నేను భావించడం లేదు. మన బాష, సంస్కృతి సంప్రదాయాలను పట్టించుకోని తెలుగు సినిమా వారికి ప్రభుత్వం రాయితీలు ఇవ్వడాన్ని వ్యక్తిగతంగా నేను వ్యతిరేకిస్తున్నాను. కానీ ప్రభుత్వం లెక్కలు, దాని అవసరాలు వగైరా దానికీ ఉంటాయి. కనుక దానిని మనం తప్పు పట్టలేము. కానీ మన తెలంగాణా సినిమా రంగాన్ని అభివృద్ధి చేసుకోవలసిన అవసరం మాత్రం చాలా ఉంది అని నేను భావిస్తున్నాను,” అని నందిని సిద్దారెడ్డి అన్నారు. సశేషం..  

మొదటి రెండు భాగాల లింక్స్ : 

http://www.mytelangana.com/telugu/editorial/6783/nandini-sidda-reddy-interview 

http://www.mytelangana.com/telugu/editorial/6784/nandini-sidda-reddy-interview   


Related Post