కేజీ టు పీజి హామీ అటకెక్కినట్లేనా?

May 02, 2017


img

తెరాస ఎన్నికల వాగ్దానాలలో కేజీ టు పీజి ఉచిత విద్య కూడా ఒకటి. రాష్ట్ర హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి నిన్న కార్మిక దినోత్సవం సందర్భంగా రవీంద్ర భారతిలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ, “కేజీ టు పీజి ఉచిత విద్యను అందించడం కోసం మా ప్రభుత్వం రెండేళ్ళు లోతుగా అధ్యయనం చేసింది. కొన్ని సమస్యల కారణంగా అది ఆచరణ సాధ్యం కాదని తేలింది. అందుకే కేజీ స్థాయి విద్యను అంగన్ వాడి సంస్థలకు అప్పగించాము. పిల్లలకు 5వ తరగతి వరకు చదువుకొన్న తరువాత వారిని గురుకుల పాఠశాలలో చేర్చి ఇంటర్మీడియెట్ వరకు చదివిస్తాము. ఆ తరువాత పీజి చేయిస్తాము,” అని అన్నారు. 

ఎన్నికల సమయంలో కేజీ టు పీజి ఉచిత విద్య అందిస్తామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చిన మూడేళ్ళ తరువాత అది ఆచరణ సాధ్యం కాదని చావు కబురు చల్లగా చెప్పినట్లు చెప్పడం విశేషం. ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవడానికే సౌకర్యాలు లేక విద్యార్ధులు నానా కష్టాలు పడుతున్నారు. ఇక అంగన్వాడీలో చదువులు అంటే ఏవిధంగా ఉంటాయో చెప్పనవసరం లేదు. 

మూడేళ్ళు గడిచిన తరువాత కేజీ టు పీజి ఉచిత విద్య ఆచరణ సాధ్యం కాదని స్వయంగా మంత్రే చెపుతున్నారు. కనుక రాజకీయ పార్టీలు ఇచ్చిన హామీలను అమలుచేయలేకపోతే వాటికే అప్రదిష్ట పైగా ప్రతిపక్షాలు కూడా ఊరుకోవు. నోటికి వచ్చినట్లు హామీలు ఇచ్చేసి అధికారంలోకి వచ్చేక చేతులు దులుపుకొందామంటే ఇదివరకులాగ ప్రజలు కూడా ఊరుకోవడం లేదు. పార్టీలను, ప్రభుత్వాలను నిలదీస్తున్నారు. తమను మోసం చేశాయనుకొన్న పార్టీలకు ఎన్నికలలో గుణపాఠం చెపుతున్నారు. కనుక వచ్చే ఎన్నికలలోనైనా అన్ని పార్టీలు ఆచరణ సాధ్యం కాని హామీలు ఇవ్వకుండా ఉంటేనే మంచిది.


Related Post