కాశ్మీర్ భారత్ చేజారిపోబోతోందా?

May 01, 2017


img

కాశ్మీర్ లో నిత్యం జరుగుతున్న ఉగ్రవాదుల దాడులు, అల్లర్లు, విద్యార్ధుల తిరుగుబాటు, జవాన్లపై ప్రజల దాడులు చూస్తుంటే కాశ్మీర్ పై భారత్ క్రమంగా తన పట్టుకోల్పోతున్నట్లు కనిపిస్తోంది. ఈరోజు హిజ్ బుల్ ముజాహుద్దీన్ కు చెందిన కొందరు ఉగ్రవాదులు జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్ కు చెందిన ఒక వాహనంపై ఆకస్మిక దాడి చేసి, దానికి భద్రతగా వెళుతున్న ఒక ఎస్.ఐ. నలుగురు పోలీసులు, ఇద్దరు బ్యాంక్ సిబ్బందిని కాల్చి చంపి వాహనంలో ఉన్న నగదును, పోలీసుల వద్ద ఉన్న ఆయుధాలను ఎత్తుకుపోయారు. సోమవారం మధాహ్నం దక్షిణ కాశ్మీర్ లోని కుల్గాం జిల్లాలోని ఈ సంఘటన జరిగింది. ఆ దాడి తమపనే అని హిజ్ బుల్ ముజాహుద్దీన్ ప్రకటించుకొంది. 

నోట్ల రద్దు తరువాత కొంతకాలం కాశ్మీరులో అల్లర్లు తగ్గుముఖం పట్టినా ఇప్పుడు ఇదివరకు కంటే తీవ్రస్థాయిలోనే జరుగుతున్నాయి. బ్యాంకు వాహనంపై ఉగ్రవాదులు దాడి చేసి, ఏడుగురు సిబ్బందిని కాల్చి చంపడం, నగదు, ఆయుధాలను దోచుకుపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. కొని రోజుల క్రితం కాశ్మీరీ యువకులు ఈవియంలను తీసుకువెళుతున్న జవాన్లను బూతులు తిడుతూ, కాళ్ళతో తన్నడం, వారి హెల్మెట్లను తీసి విసిరికొట్టడం అందరూ చూశారు.

కాశ్మీర్ లో పరిస్థితులు నానాటికీ దిగజారిపోతున్నప్పటికీ, ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీ ఏమి చేయలేని నిసహాయస్థితిలో ఉండటం శోచనీయం. రాష్ట్రానికి గుండెకాయ వంటి కాశ్మీర్ లో ఎప్పుడూ ఇవే పరిస్థితులు నెలకొని ఉన్నప్పుడు అభివృద్ధి ఏవిధంగా సాధ్యం? అని ఆలోచించకుండా రాష్ట్రాభివృద్ధి కోసం కేంద్రప్రభుత్వం రూ.16,000 కోట్లు నిధులు మంజూరు చేయడం ఆశ్చర్యం కలిగిస్తుంది.

కాశ్మీర్ సమస్య దేశానికి ఒక క్యాన్సర్ వ్యాధిలా పీడిస్తున్న ఆ రాష్ట్ర ప్రభుత్వం కానీ  కేంద్రప్రభుత్వం గానీ దానికి పరిష్కారం కనుగొనలేకపోతున్నాయి. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు కాశ్మీర్ సమస్యకు శాశ్విత పరిష్కారం కనుగొనకపోతే ఏదో ఒకనాడు కాశ్మీర్ మన చేజారిపోవడం ఖాయం. ఇక దేశంలో మిగిలిన రాష్ట్రాలు, పార్టీలు, నేతలు, ప్రజలు కూడా కాశ్మీర్ సమస్య గురించి ఆలోచించడానికి కూడా ఆసక్తి చూపకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. అది పోరిగింటికి నిప్పు అంటుకొంటే మనకెందుకు అన్నట్లుంది. 


Related Post