అమృతధారలు-4

April 29, 2017


img

ఒక్క సిద్ధిపేట నియోజకవర్గంలో 118 ఎకరాల సాగుకు 80 బోర్లు తవ్విస్తే వాటిలో 52 బావులలో నీళ్ళు పడలేదు. దుబ్బాక నియోజకవర్గంలో 108 ఎకరాలలో సాగుకోసం 154 బోర్లు త్రవ్వగా వాటిలో 94 బోర్లలో నీళ్ళు పడలేదు.  ఇక గజ్వేల్ నియోజకవర్గంలో 50 వేల హెక్టార్లలో ఎన్ని బోర్లు వేశారో తెలుసా? వందా..రెండొందలు కాదు ఏకంగా 60,000 బోర్లు. వాటిలో చాలా వరకు ఎండిపోయాయి. కారణం...వర్షపునీరు భూమిలో ఇంకేందుకు ఏర్పాటు చేసిన కందకాలను రైతులు పూడ్చిపెట్టేసి సాగుచేసుకోవడమే. 

ఈ గణాంకాలు కేవలం 3-4 నియోజక వర్గాలకు సంబంధించినవి మాత్రమే. ఒక్కో బోరు బావి తవ్వడానికి రైతులు కనీసం రూ.70,000 ఖర్చు అవుతుంది. ఆ లెక్కన రాష్ట్రా వ్యాప్తంగా నీళ్ళు పడని బోరుబావులు, ఎండిపోయిన వాటిపై రైతులు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారో..ఎవరైనా ఊహించగలరా...లెక్కగట్టగలరా? అంటే వీలుకాదనే చెప్పాలి. వియత్నాం యుద్ధంలో శత్రువులను నిలువరించడానికి భూమిలో వేలాదిగా ల్యాండ్ మైన్స్ అమర్చడం వలన వేలాది మంది చనిపోయారు. అనేక వేలమంది శాస్వితంగా అంగవైకల్యం పొందారు. రాష్ట్ర వ్యాప్తంగా తవ్వి వదిలేసిన ఈ బోరుబావులు కూడా అటువంటివేనని చెప్పవచ్చు. వేలాది రైతులకు అవి ఉరిత్రాళ్ళుగా, పసిపిల్లల పాలిట మృత్యుకూపాలుగా మారడం మాత్రం అందరం చూస్తూనే ఉన్నాము. .      

అసలు బోరు బావులు త్రవ్వే ముందు అక్కడ నీళ్ళు పడే అవకాశాలు ఉన్నాయా లేదా? నీళ్ళు పడేమాటయితే ఎంత లోతులో పడవచ్చు? ఆ బోరు స్థిరంగా నీళ్ళు అందించగలదా లేదా? చుట్టుపక్కల ఇంకుడు గుంతలు, చెరువులు, కుంటలు, కాలువలు వంటి సహజనీటివనరులు ఉన్నాయా లేదా? ఒకవేళ ఉన్నా వాటి నుంచి బోరుబావులకు నిరంతరం నీరు చేరే అవకాశాలు ఉన్నాయా లేవా? వంటి విషయాలను ముందుగా తెలుసుకొంటే రైతులకు ఇంత నష్టం, కష్టం రెండూ ఉండవు. అయితే ఈ విషయాలన్నీ రైతులకు తెలియకపోవచ్చు. కనుక గ్రామస్థాయివరకు విస్తరించి ఉన్న ప్రభుత్వ అధికారులే వారికి మార్గదర్శనం చేసి నష్టపోకుండా చూడవలసిన బాధ్యత ఉంది.

సకాలంలో ఒక కుట్టువేస్తే సరిపోయేదానికి ఆలస్యం చేస్తే పది కుట్లు వేసినా ప్రయోజనం ఉండదు. బోరుబావుల విషయంలో సరిగ్గా అదే జరుగుతోందని చెప్పవచ్చు. అధికారుల అలసత్వం లేదా పని ఒత్తిడి కారణంగా రైతులకు మార్గదర్శనం చేయలేకపోవడం వలననే నిరంతరంగా ఈ సామాజిక విద్వంసం జరుగుతోందని చెప్పకతప్పదు.

దీని వలన రైతులే కాకుండా ప్రభుత్వాలు, వాటిని నడుపుతున్న రాజకీయ పార్టీలు కూడా చాలా బారీ మూల్యం చెల్లించవలసి వస్తోందనే విషయం ఎవరూ పట్టించుకోకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆర్ధిక సమస్యలతో రైతులు ఆత్మహత్యలు చేసుకొన్నా, పంటలు పండకపోయినా, పండిన పంటలకు నీళ్ళు అందకా ఎండిపోయినా ముందుగా ప్రభుత్వానికే తీరని అప్రదిష్ట చుట్టుకొంటుంది. ప్రభుత్వాన్ని నడిపిస్తున్న పార్టీకూడా  రాజకీయంగా నష్టపోయే ప్రమాదం ఉంటుంది. ఇక ఈ సమస్య నుంచి తాము బయటపడి రైతులను బయటపడేయడానికి ప్రభుత్వం భారీగా డబ్బు ఖర్చు చేయవలసి వస్తుంది కనుక అది ఆర్ధికంగా పెనుభారం అవుతుంది. 

పక్కనే చెరువులు లేదా నిత్యం నీళ్ళు పారే కాలువలు ఉన్నా పక్కనే త్రవ్విన బోరుబావులలో నీళ్ళు ఎందుకు పడటంలేదని చాల మంది రైతులు ఆవేదన చెందుతారు. డానికి కారణం ఆ చెరువులు లేదా కాలువల గర్భంలో నెల రాతి పలకలతో కూడిన నేలకావచ్చు..లేదా నీరు భూమిలోకి ఇంకే గుణం లేని నేలకావచ్చు లేదా వేరేదైనా కారణాలు ఉండవచ్చు. అది శాస్త్రీయంగా పరిశీలించి తెలుసుకోవాలని ఈ రంగంలో విశేషకృషి చేస్తున్న సుబాష్ రెడ్డి సూచిస్తున్నారు. 

తెలంగాణాలో కోటి ఎకరాలకు నీళ్ళు పారించాలని చాలా పట్టుదలగా ఉన్న ప్రభుత్వానికి, తన రాష్ట్రానికి ఉడతాభక్తిగా సహాయసహకారాలు అందించడానికి తాను, తన స్మరణ్ సంస్థ సభ్యులు ఎప్పుడూ సిద్దంగా ఉన్నామని సుబాష్ చంద్ర రెడ్డి చెపుతున్నారు. వర్షాకాలం రెండు మూడు నెలలలో వాగులు, వంకలు, చెరువులు అన్నీ పొంగి పారుతుంటాయి. ఆ అదనపు నీటిని ఒడిసిపట్టుకొని బోరుబావులవైపు మళ్ళించడానికి ప్రభుత్వం తమకు చేయూతనిస్తే, వేసవిలో ఆ 2-3 నెలల గడ్డు కాలాన్ని అవలీలగా అధిగమించవచ్చని సుబాష్ చంద్ర రెడ్డి గట్టిగా చెపుతున్నారు. 

ముఖ్యమంత్రి కేసీఆర్ కలలు కన్తున్నట్లు రైతులు అందరూ కాలు మీద కాలు వేసుకొని కూర్చొని వ్యవసాయం చేసుకోవాలంటే ముందుగా బోరుబావులను వర్షపునీటితో రీ-ఛార్జ్ చేసి ఇవ్వగలిగితే చాలు. పెద్ద పెద్ద ప్రాజెక్టులకయ్యే ఖర్చుతో పోలిస్తే ఈ పద్దతిలో బోరుబావులను రీ-ఛార్జ్ చేయడానికి చాలా తక్కువ ఖర్చు అవుతుంది...పైగా చాలా తక్కువ కాలంలోనే ఆశించిన ఫలితాలు కనబడతాయని సుబాష్ చంద్ర రెడ్డి నమ్మకంగా చెపుతున్నారు. 

మరి ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే, ఈ పనులు మొదలుపెట్టడానికి ఇదే సరైన సమయం. ఎందుకంటే మరొక నెల-రెండు నెలలోనే వర్షాలు పడటం మొదలవుతాయి. ఈలోగా చెరువులు, కాలువలలో పారబోయే అదనపు నీటిని ఒడిసిపట్టి బోరుబావులవైపు తరలించడానికి ఏర్పాట్లు ఇప్పుడే చేసుకోగలిగితే ఫలితాలు వెంటనే కనబడుతాయని సుభాష్ చంద్ర రెడ్డి చెపుతున్నారు. మరి ఈ తెలంగాణా శ్రేయోభిలాషి మాటలు ఎవరి చెవినైనా పడుతాయో లేదో చూడాలి. 

నీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నవారు..ఈ మహా యజ్ఞంలో పాలుపంచుకోవాలనుకొనేవారు.. సుబాష్ చంద్రరెడ్డి గారి సలహాలు, సేవలు పొందగోరేవారు.. సంప్రదించవలసిన ఈ మెయిల్ : saverainwater@gmail.com, ఫోన్: 9440055253

అమృతధారలు లింక్స్:

http://www.mytelangana.com/telugu/editorial/6674/subash-chandra-reddy-efforts-to-save-the-rain-water 

http://www.mytelangana.com/telugu/lifestyle/6678/subash-chandra-reddys-efforts-for-rain-water-conservation 

http://www.mytelangana.com/telugu/editorial/6694/rain-water-conservation-in-telangana-state    



Related Post