తెరాసలో కట్టప్పలు?

April 29, 2017


img

బాహుబలి సినిమా ప్రభావం ప్రధాని నరేంద్ర మోడీ నుంచి గల్లీ స్థాయి రాజకీయ నేత వరకు అందరిపై కనిపిస్తోంది. వచ్చే ఎన్నికలనాటికి కాంగ్రెస్ పార్టీలో నుంచే ఒక బాహుబలి పుట్టబోతున్నాడు. అతను తెరాస సామ్రాజ్యాన్ని ద్వంసం చేస్తాడని ఒక సీనియర్ కాంగ్రెస్ నేత అన్నారు. 

మొన్న వరంగల్ సభలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతూ “తెలంగాణాలో ఒకే ఒక బాహుబలి ఉన్నాడు. అతనే ముఖ్యమంత్రి కేసీఆర్. అతనిని ఎదిరించగల మొనగాడు తెలంగాణాలో లేడు,” అని అన్నారు. 

కాంగ్రెస్ నేత గండ్ర వెంకటరమణారెడ్డి హన్మకొండలో మీడియాతో మాట్లాడుతూ, “కేసీఆర్ గారు మిమ్మల్ని బాహుబలి అని పొగుడుతున్నవారిని చూసి పొంగిపోవద్దు. మీ పార్టీలో చాల మంది కట్టప్పలు ఉన్నారని గుర్తుపెట్టుకోండి. పోరాటాల పురిటిగడ్డ ఓరుగల్లులో సభతోనే తెరాస వెలుగులోకి వచ్చింది. మళ్ళీ మొన్న అక్కడే నిర్వహించిన సభతోనే దాని పతనం ఆరంభం అయ్యింది. దేశంలో మరే పార్టీ ఇన్ని లక్షలమందితో బహిరంగ సభ నిర్వహించలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ డబ్బా కొట్టుకొన్నప్పటికీ, ఆయన మాటలకు సభకు హాజరైన వారి నుంచి ప్రతిస్పందన కరువవడం చూస్తుంటే, ఆ సభ ఒక అట్టర్ ఫ్లాప్ కబలీ సూపర్ షో మాదిరిగా ఉంది,” అని అన్నారు. 

“అసెంబ్లీ లోపల ప్రతిపక్షాల గొంతు నొక్కేస్తూ, అసెంబ్లీ వెలుపల, చివరికి ఇందిరా పార్క్ వద్ద కూడా ప్రజలు, ప్రతిపక్షాలు తమ నిరసనలు తెలియజేయకుండా అడ్డుకొంటూ కేసీఆర్ నియంతల వ్యవహరిస్తున్నారు. ఎవరినీ కలవకుండా ఎవరికీ తనను కలిసేందుకు అవకాశం ఇవ్వకుండా ఆయన చాలా అహంకారపూరిత్మగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణా ఇచ్చిన వారిపట్ల ఆయనకు కృతజ్ఞత లేదు. తెలంగాణా కోసం ప్రాణాలు అర్పించిన అమరావీరులంటే గౌరవం లేదు. తెలంగాణా సిద్దాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ ఫోటోలు సభలో పెట్టలేదు. కనీసం వారిని ఒకసారి స్మరించుకాకుండానే సభను నిర్వహించడం కేసీఆర్ నిరంకుశవైఖరికి, అహంకారానికి నిదర్శనం,” అని గండ్ర వెంకటరమణారెడ్డి ఘాటుగా విమర్శించారు.

ఇంతకాలం బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు? అనే సస్పెన్స్ ఉండేది. అదిప్పుడు తీరిపోయింది. కానీ తెరాసలో చాలా మంది  కట్టప్పలున్నారనే మాట విన్నాక ఇంతకీ కట్టప్ప రాజభక్తుడా..రాజద్రోహా? అనే మరో సందేహం కలుగుతోంది. 


Related Post