ఆవులని రక్షిస్తామంటారు..మరి ఆడవాళ్ళనో?

April 12, 2017


img

ఆదిత్యనాథ్ యోగి యూపి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి దేశంలో గోవధ నిషేధంపై పెద్ద చర్చే జరుగుతోంది. గోసంరక్షుల పేరిట కొంతమంది దాడులు చేస్తున్నారు. ఇది క్రమంగా ఇరుగుపొరుగు రాష్ట్రాలకు కూడా పాకుతోంది. ఇదే సమయంలో కోల్ కతా భారతీయ జనతా యువ మోర్చాకు చెందిన యోగేష్ అనే వ్యక్తి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తల నరికి తెచ్చినవారికి రూ.11లక్షలు బహుమానం ఇస్తానని ప్రకటించడం సంచలనం సృష్టించింది. 

అతని వ్యాఖ్యలతో భాజపాకు సంబంధం లేదని అవి అతని వ్యక్తిగతమని చెప్పి భాజపా తప్పించుకొనే ప్రయత్నం చేసింది. కానీ ఈరోజు రాజ్యసభ లో యోగేష్ వ్యాఖ్యలపై తృణమూల్ కాంగ్రెస్ సభ్యులతో సహా ప్రతిపక్ష సభ్యులు భాజపా వైఖరిని తీవ్రంగా విమర్శించారు. ఈ చర్చలో పాల్గొన్న రాజ్యసభ సభ్యురాలు, అలనాటి బాలీవుడ్ నటి జయబచ్చన్ మాట్లాడుతూ, “భాజపా ఆవులను కాపాడాలని చెపుతుంటుంది. కానీ దేశంలో మహిళలను మాత్రం పట్టించుకోవడం లేదు. మహిళలకు రక్షణ లేదని ఈ వ్యాఖ్యలు నిరూపిస్తున్నాయి. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న ఒక మహిళకే భద్రత లేకపోతే ఇక సామాన్య మహిళల పరిస్థితి ఏవిధంగా ఉంటుంది? ముఖ్యమంత్రి తల నరకమని ప్రజలను రెచ్చగొట్టిన వ్యక్తిపై కటిన చర్యలు తీసుకోవాలి,” అని అన్నారు. 

భాజపా నేతలు ఆవులకు ఇస్తునంత ప్రాధాన్యత దేశంలో స్త్రీలకు ఇవ్వడం లేదని జయబచ్చన్ చెప్పిన మాట చాలా బాధాకరమే..చాలా ఆలోచించవలసిన విషయమే. ఇకనైనా భాజపా నేతలు, భాజపా ప్రభుత్వాలు, కేంద్రప్రభుత్వం అన్నీ దేశంలో మహిళలు, బాలికల రక్షణకు అవసరమైన చర్యలు తీసుకొంటే మంచిది. 


Related Post