పాక్ మళ్ళీ తప్పటడుగు వేసిందా?

April 12, 2017


img

పఠాన్ కోట్ వైమానిక స్థావరంపై పాక్ ఉగ్రవాదులు దాడులు చేసినప్పటి నుంచే ప్రపంచదేశాల ముందు పాక్ దోషిగా నిలబడే పరిస్థితి ఏర్పడింది. ఆ తరువాత జరిగిన అనేక పరిణామాలతో పాక్ స్థాయి ఇంకా దిగజారిపోయింది. అందుకే భారత సేనలు పాక్ భూభాగంలో ప్రవేశించి సర్జికల్ స్ట్రయిక్స్ చేసి వచ్చినా ప్రపంచ దేశాలు భారత్ సాహసాన్ని మెచ్చుకొన్నాయే తప్ప తప్పు పట్టలేదు. భారత్ సర్జికల్ స్ట్రయిక్స్ చేసిందని తెలిసి ఉన్నప్పటికీ పాక్ ఏమి చేయలేకపోయింది. అది పాక్ కు చాలా అవమానకరమైన విషయం కావడంతో సర్జికల్ స్ట్రయిక్స్ జరుగలేదని సర్ది చెప్పుకోవలసివచ్చింది. 

బహుశః ఆ అవమానానికి ప్రతీకారంగా భారత మాజీ నేవీ అధికారి కులభూషణ్ జాదవ్ ను పట్టుకొని ఎటువంటి న్యాయవిచారణ చేయకుండానే ఉరి శిక్ష విధించింది. కానీ అదే మరో పెద్ద పొరపాటు అని ఇప్పుడు తెలుసుకొని వెనక్కి తగ్గవలసి వస్తోంది. ముంబై 26/11 దాడులలో పట్టుబడిన అజ్మల్ కసాబ్ అనే పాక్ ఉగ్రవాదిని భారత న్యాయస్థానాలలో సుదీర్గ విచారణ చేసి, అతను దోషి అని నిర్దారించుకొన్న తరువాతనే ఉరి శిక్ష విదించబడింది. కానీ కులభూషణ్ విషయంలో పాక్ మిలటరీ కోర్టులో రహస్యంగా విచారించి ఉరి శిక్ష విదించడంతో భారత్ తో సహా అనేకదేశాలు తప్పు పడుతున్నాయి.

అతనిని రక్షించుకోవడానికి ఎంత సాహాసం చేయడానికైనా వెనుకాడబోమని భారత ప్రభుత్వం పార్లమెంటులో ప్రకటించింది. భారత్ చేసిన తీవ్ర హెచ్చరికల వలనయితేనేమి, ప్రపంచ దేశాల ఒత్తిళ్ళ వలనయితేనేమి పాక్ వెనక్కు తగ్గింది. కులభూషణ్ కు ఇప్పటికిప్పుడు మరణశిక్ష విదించబోమని, క్షమాభిక్ష కోసం అప్పీలు చేసుకొనేందుకు అతనికి 60 రోజులు గడువు ఉందని చెప్పింది.

కులభూషణ్ నేరం చేసినట్లు న్యాయస్థానంలో నిరూపించకుండానే హడావుడిగా, రహస్యంగా విచారణ జరిపేసి మరణశిక్ష విదించడంపై పాక్ మీడియా, ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వాన్ని తప్పు పడుతున్నాయి. దాని తొందరపాటు నిర్ణయం వలన ప్రపంచదేశాల ముందు..ముఖ్యంగా తన శత్రువైన భారత్ ముందు మళ్ళీ తలదించుకోవలసి వచ్చిందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. భారత్ ను దెబ్బ తీయాలని ప్రయత్నించిన ప్రతీసారి పాక్ కు ఇటువంటి చేదు అనుభవాలే ఎదురవుతున్నా దాని తీరు మారడం లేదు. ఇంతవరకు పాక్ చెరలో నుంచి కులభూషణ్ ఏవిధంగా బయటపడతాడని అందరూ ఆలోచించారు. కానీ ఇప్పుడు ఈ వ్యవహారంలో నుంచి పాకిస్తాన్ గౌరవప్రదంగా ఎలాగ బయటపడుతుందని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. 


Related Post