ఈవిఎంల గురించి లొల్లి దేనికి?

April 12, 2017


img

యుపి ఎన్నికలలో ఈవిఎంలను ట్యాంపరింగ్ చేసి భాజపా ఘన విజయం సాధించిదనే ప్రతిపక్షాల వాదనలను కేంద్రప్రభుత్వమూ, ఎన్నికల కమీషన్ కూడా కొట్టిపడేయడంతో ప్రతిపక్ష నేతలు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పిర్యాదు చేయాలని భావిస్తున్నారు. 

అయితే ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను లోతుగా పరిశీలించినట్లయితే అవి అర్దరహితమని అర్ధం అవుతుంది. ఒకవేళ ఈవిఎంలను భాజపా ట్యాంపరింగ్ చేయగలిగిన్నట్లయితే, గోవా, మణిపూర్ పంజాబ్ రాష్ట్రాలలో కూడా చేసి ఉండేది కదా? అప్పుడు 5 రాష్ట్రాలలో విజయం సాధించగలిగి ఉండేది కదా? అయినా ఎన్నికల కమీషన్ అధీనంలో ఉండే వేలాది ఈవిఎంలను కేంద్రప్రభుత్వం ట్యాంపరింగ్ చేయడం సాధ్యమేనా? చేయాలని ప్రయత్నిస్తే ఆ విషయం బయటకు పొక్కకుండా ఉంటుందా? అని ఆలోచిస్తే ప్రతిపక్షాల వాదన ఎంత అర్ధరహితమో అర్ధమవుతుంది. 

అవి తమ ఓటమిని, వైఫల్యాలను కప్పిపుచ్చుకోనేందుకే ఇటువంటి ఆరోపణలు చేస్తూ సామాన్య ప్రజలను ముఖ్యంగా నిరక్షరాస్యులైన ప్రజలను త్రప్పు ద్రోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని చెప్పవచ్చు. ఒకవేళ ప్రతిపక్ష నేతలు దీనిపై రాష్ట్రపతికి పిర్యాదు చేస్తే అవి ఆయనతో కూడా పరాచికాలు ఆడుతున్నట్లే భావించవలసి ఉంటుంది.         

పంజాబ్ లో కాంగ్రెస్ గెలిచింది కనుక అక్కడ ఈవిఎంలను అది తప్పు పట్టడం లేదు. అలాగే గోవా, మణిపూర్ లో కూడా భాజపా కంటే దానికి ఎక్కువ సీట్లు వచ్చాయి కనుక అక్కడా వాటి పనితీరుపై ఎటువంటి అనుమానాలు వ్యక్తం చేయలేదు. ఒక్క యూపిలోనే అనుమానిస్తున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్, ఎస్పి, బిఎస్పి పార్టీలు ఆ ఎన్నికలలో ఎలాగైనా విజయం సాధించాలని చాలా తహతహలాడాయి. కానీ కుటుంబ కలహాల వలన ఎస్పి, దానితో జత కట్టిన పాపానికి కాంగ్రెస్, బహుశః నోట్ల రద్దు కారణంగా బి.ఎస్పిలు ఓడిపోయాయి. వాటికి కనీసం గౌరవప్రదమైన సీట్లు వచ్చినా అవి ఇటువంటి ఆరోపణలు చేసి ఉండేవే కావు. కానీ ఎన్నికలలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినందున ఈవిధంగా ఆడలేక మద్దెల ఓడన్నట్లు వితండవాదం చేస్తున్నాయని చెప్పవచ్చు. 

ప్రతిపక్షాలు ఈవిఎంలపై సందేహాలు వ్యక్తం చేస్తున్నప్పుడు, వాటిని ట్యాంపరింగ్ చేసి చూపమని ఎన్నికల కమీషన్ నిపుణులకు అవకాశం కల్పించి ఉంటే బాగుండేది. కానీ ప్రతిపక్షాల ఆరోపణలను తేలికగా కొట్టిపడేయడం వలన వాటి వాదనకు, వాటి అనుమానాలకు బలం చేకూర్చుతున్నట్లు అవుతోంది. 


Related Post