భలే చెప్పావ్ రేవంత్ అన్నా!

April 11, 2017


img

“తెలంగాణాలో తెదేపా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని తెరాస నేతలు చెపుతుంటారు. కానీ తెరాసతో సహా కాంగ్రెస్, భాజపాలు కూడా తెదేపాతో పొత్తులు పెట్టుకోవాలని ఉవ్విళ్ళూరుతున్నాయి. రాష్ట్రంలో తెదేపా బలంగా ఉందని చెప్పడానికి ఇంతకంటే గొప్ప నిదర్శనం ఏమి కావాలి?” ఈ మాటలన్నది తెదేపా వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో జరుగుతున్న ఒక శిక్షణా కార్యక్రమంలో రేవంత్ రెడ్డి చెప్పారిది.

తెలంగాణాలో తెదేపా దాదాపు తుడిచిపెట్టుకుపోయిన మాట వాస్తవమే కానీ నేటికీ రేవంత్ రెడ్డి వంటి కొద్దిమంది బలమైన నేతల కారణంగా తెదేపా తన ఉనికిని చాటుకొంటూనే ఉందనేది వాస్తవమే. కానీ అంతమాత్రన్న అన్ని పార్టీలు దానితో పొత్తులకు ఎగబడుతున్నాయని చెప్పుకోవడం చాలా హాస్యాస్పదంగా ఉంది. అందుకు బలమైన ఒక్క కారణం లేదా నిదర్శనం కూడా చూపలేరు.

ఏపిలో నేటికీ తెదేపాకి మిత్రపక్షంగా, ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న భాజపా, తెలంగాణాలో మాత్రం తెదేపాను రాజకీయ గుదిబండగా భావించి దానికి దూరం అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక రేవంత్ రెడ్డి తన రాజకీయ భవిష్యత్ ను కాపాడుకొనేందుకు ఏదో ఒక పార్టీలో చేరవచ్చని మీడియాలో ఊహాగానాలు వినిపిస్తుంటే, అన్ని పార్టీలు తెదేపాతో పొత్తులకు తహతహలాడిపోతున్నాయని, వచ్చే ఎన్నికలలో 100 సీట్లను యువతకే కేటాయిస్తామని చెప్పుకోవడం ఇంకా హాస్యాస్పదంగా ఉంది. 

తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ కూడా కొంచెం అతిశయంగా నే మాట్లాడారు. వచ్చే ఎన్నికలలో తెదేపా అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి కేసీఆర్ కట్టుకొన్న విలాసవంతమైన ప్రగతి భవన్ అధికార నివాసంలో ఒక ప్రభుత్వ ఆసుపత్రి ఏర్పాటు చేస్తామని చెప్పారు. యూపిలో ప్రజలు కుటుంబపాలనకు స్వస్తి పలికినట్లుగానే తెలంగాణా ప్రజలు కూడా వచ్చే ఎన్నికలలో కేసీఆర్ కుటుంబపాలనకు స్వస్తి పలుకబోతున్నారని జోస్యం చెప్పారు. 

యూపి ఎన్నికల ఫలితాలను తెదేపా నేతలు తమకు అనుకూలంగా చాలా చక్కగా అన్వయించుకొన్నారు. కానీ యూపిలో రాజకీయ పరిస్థితులు ఇక్కడ లేవనే సంగతి పట్టించుకోవడం లేదు. ఒకవెల్ ప్రజలు తెరాసను కాదనుకొన్నా ఆంధ్రా మూలాలు ఉన్న తెదేపా కంటే తెలంగాణా ఏర్పాటు చేసినందుకు కాంగ్రెస్ పార్టీకో లేదా కేంద్రంలో మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశాలున్న భాజపాకో అధికారం కట్టబెట్టే అవకాశాలున్నాయనే సంగతి బహుశః తెదేపా నేతలకి కూడా తెలిసే ఉండాలి. రాష్ట్రంలో తెదేపా అధికారంలోకి రావాలని కోరుకోవడం కలలు కనడం తప్పు కాదు కానీ వాపును చూసి బలుపు అనుకోవడమే తప్పు. 


Related Post