ఇది వివక్షకు నిదర్శనం కాదా?

April 11, 2017


img

భాజపా మాజీ ఎంపి తరుణ్ విజయ్ దక్షిణాది రాష్ట్రాల వారి గురించి చులకనగా మాట్లాడినందుకు ప్రస్తుతం పార్లమెంటులో చిన్నపాటి యుద్దమే జరుగుతోంది. 

కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ లోక్ సభలో ప్రతిపక్ష సభ్యులను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “కేంద్రప్రభుత్వానికి ఉత్తరాది, దక్షిణాదివారనే బేధం లేదు. అందరూ సమానమే. ఎవరి పట్ల ఎటువంటి వివక్ష చూపడం లేదు,” అని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ప్రతిపక్షాలు తమ ఆందోళన విరమించలేదు. అది వేరే సంగతి. 

కానీ దక్షిణాదివారి పట్ల కేంద్రప్రభుత్వం కూడా వివక్ష చూపుతోందని చెప్పడానికి గత నాలుగు వారాలుగా డిల్లీ మండుటెండల్లో ధర్నాలు చేస్తున్న తమిళ రైతన్నలను ఎవరూ పట్టించుకోకపోవడమే ప్రత్యక్ష నిదర్శనం. ఆర్ధిక సమస్యలు తాళలేక ఆత్మహత్యలు చేసుకొన్న తమ సాటి రైతుల కపాలాలను వారు తమతో తీసుకువచ్చి ప్రదర్శించినా, తమ ధైన్యస్థితిని చాటి చెప్పేందుకు ఎలుకలను వండుకొని తింటున్నా, మండే ఎండల్లో అర్ధనగ్నంగా నిలబడి నిరసనలు తెలియజేస్తున్నా ఇంతవరకు కేంద్రప్రభుత్వం తరపున ఒక్క మంత్రికానీ, వ్యవసాయ శాఖా నుంచి ఒక్క ఉన్నతాధికారి గానీ వారివైపు కన్నెత్తి చూడలేదు. రోజులు గడుస్తున్న కొద్దీ తమిలరైతన్నల సహనం కూడా నశించిపోతోంది. దానితో వారిలో కొందరు నిన్న ప్రధాని నరేంద్ర మోడీ నివాసం ముందే పూర్తి నగ్నంగా నిలబడి నిరసనలు తెలిపారు. 

తమిళరైతులు వినూత్నంగా చేస్తున్న ఈ నిరసనలు డిల్లీ ప్రజలకు, జాతీయ మీడియాకు, ఏసీ గదులలో కూర్చొని దేశం ఎదుర్కొంటున్న సమస్యలపై తమ అభిప్రాయలు చెప్పే మేధావులకు, డిల్లీ పాలకులకు చాలా అనాగరికంగా కనిపించవచ్చు. కానీ అది అనాగరికం కాదు...వారి కడుపు మంట. వారు తమకు తెలిసిన విధంగా నిరసనలు తెలుపుతున్నారు. వాటిని పట్టించుకోకపోవడమే అమానుషం..అనాగరికం. 

అందరికీ అన్నం పెట్టే అన్నదాత డిల్లీ వీధుల్లో ఈవిధంగా అక్రోశిస్తుంటే పట్టించుకోకపోవడం అమానుషం కాదా...వివక్ష కాదా? ఆ అన్నదాతల ఆక్రందనలు పట్టించుకోకుండా వారి సమస్య గురించి పార్లమెంటులో మాట్లాడకుండా, దక్షిణాది వారి గురించి అనుచితంగా మాట్లాడిన ఆ మాజీ ఎంపిని శిక్షించాలని పట్టుబడుతూ ప్రతిపక్షాలు రాజకీయాలు చేయడం సబబేనా? 

కనీసం ఇప్పటికైనా కేంద్రప్రభుత్వం ఆ రైతన్నల గోడు విని వారి సమస్యలను పరిష్కరించకపోతే, తమిళనాడులో మళ్ళీ అగ్గి రాజుకొంటుంది. అప్పుడు దానిని ఆర్పడం చాలా కష్టమవుతుంది. వారి గోడును పట్టించుకోకపోతే దక్షిణాదివారి పట్ల ఉత్తరాదివారికే కాదు కేంద్రప్రభుత్వానికి కూడా చులకనభావం ఉందనే అభిప్రాయం బలపడుతుంది. 



Related Post