మిర్చి రైతుల ఆవేదన కేసీఆర్ కు పట్టదా?

April 11, 2017


img

ఈ ఏడాది మిర్చి పంట బాగా పండినందుకు సంతోషించాలో లేక గిట్టబాటు ధర రానందుకు బాధపడాలో తెలియని అయోమయస్థితిలో మిర్చి రైతులున్నారు. వ్యవసాయ మార్కెట్లకు బారీగా తరలివస్తున్న మిర్చిని కొనుగోలు చేసే నాధుడే కనబడటం లేదు. క్వింటాలుకు కనీసం రూ.10,000 ధర వస్తే తప్ప రైతులకు గిట్టుబాటు కాదు. కానీ రూ.4,000కు మించి ధర చెల్లించేందుకు వ్యాపారులు అంగీకరించడం లేదు. గత మూడు వారాలుగా మిర్చి రైతులు నిరసనలు తెలియజేస్తున్నా ఇంతవరకు ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో నిన్న రాష్ట్ర కాంగ్రెస్ నేతలు అందరూ రంగంలో దిగి జిల్లాలవారిగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. 

పిసిసి అధ్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ నేతల బృందం నిన్న వరంగల్ లోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ లో మిర్చి రైతులను కలిసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకొన్నారు. కానీ తరువాత వారిని లోపలకి అనుమతించారు. వారు మిర్చి రైతుల సమస్యలను అడిగి తెలుసుకొని వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. 

ఈ సందర్భంగా ఉత్తం కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “మిర్చి రైతులు గిట్టుబాట ధరరాక నానా కష్టాలు పడుతున్నారు. మరోపక్క ఆర్ధికసమస్యల కారణంగా నిత్యం ఎక్కడో ఒకచోట రైతులు ఆత్మహత్యలు చేసుకొంటూనే ఉన్నారు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి రైతుల సమస్యలు పట్టించుకోవడం లేదు. ఆయనకు పార్టీ ప్లీనరీ సమావేశాలు, ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ఫిరాయింపుచేయడంపై చూపే శ్రద్ధ రైతులపై చూపరు. ఇప్పటికైనా ఆయన మేల్కొనకపోతే రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరిగే ప్రమాదం ఉంది,” అని అన్నారు. 

తెరాస సర్కార్ వ్యవసాయం, సాగు, త్రాగునీరు    ప్రాజెక్టులకు చాలా ప్రాధాన్యం ఇస్తోందని అందరికీ తెలుసు. కానీ పండిన పంటలకు గిట్టుబాటు ధర అందించలేకపోతే ఎంత పండిస్తే మాత్రం రైతులకు ఏమి లాభం? ఒకప్పుడు పత్తి రైతులు..ఇప్పుడు మిర్చి రైతులు..కంది, వరి రైతులు వరుసగా కష్టాలు ఎదుర్కొంటూనే ఉన్నారు. ఆత్మహత్యలు చేసుకొంటూనే ఉన్నారు. మిర్చి రైతుల విషయంలో తెరాస సర్కార్ కనబరుస్తున్న అశ్రద్ద లేదా వారికి గిట్టుబాటు ధర కల్పించడంలో జాప్యం కారణంగానే కాంగ్రెస్ పార్టీకి దానిని విమర్శించే అవకాశం కలిగింది. 

గిట్టుబాటు ధర రానప్పుడు అది వచ్చే వరకు రైతులు తమ పంటలను భద్రంగా దాచుకొనేందుకు వారికి గోదాములు ఏర్పాటు చేసినా ఈ సమస్య ఇంత తీవ్రం అయ్యుండేది కాదు. రైతుల కోసం ప్రభుత్వం నిర్మించిన గోదాములను బడా వ్యాపారులు ఆక్రమించుకొని, వాటిలో రైతుల నుంచి తక్కువ ధరలకు కొన్న సరుకును నిలువచేసుకొంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. రైతులకు గిట్టుబాటు ధరలు అందించడం ప్రభుత్వం చేతిలో లేకపోతే కనీసం వారి కోసమే నిర్మించిన గోదాములైనా వారికి దక్కేలా ఎందుకు చేయలేకపోతోంది? వ్యవసాయశాఖ మంత్రి, అధికారులు అందరూ ఏమి చేస్తున్నారు? వారి అశ్రద్ద లేదా వైఫల్యం వలన తెరాస సర్కార్ కి చెడ్డ పేరు వస్తున్నా పట్టించుకోరా? అని రైతులు కూడా ప్రశ్నిస్తున్నారు. దానికి వారే సమాధానం చెప్పాలి. 


Related Post