ఆ బిల్లు కూడా ప్రత్యేక హోదా వంటిదేనా?

April 10, 2017


img

ముస్లింలకు 12శాతం రిజర్వేషన్ కల్పిస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. దాదాపు మూడేళ్ళు గడిచిపోయినా ఇంతవరకు దాని కోసం శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టలేదు. అందుకు అనేక కారణాలు, సంజాయిషీలు చెప్పవచ్చు. ఇప్పుడు కాకపోతే మరొక 6నెలలో..ఏడాది తరువాతైన తెరాస సర్కార్ ఈ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టవచ్చు. 

అయితే ఆ బిల్లు కూడా ఏపిలో ప్రత్యేక హోదా అంశంలాగే తయారవడం ఖాయం. ప్రత్యేక హోదా వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ప్రజలకు ఏ ప్రయోజనం కలుగకపోయినా అది ప్రతిపక్షాలకు బలమైన ఆయుధంగా ఉపయోగపడుతోంది. అదేవిధంగా ఈ ముస్లిం రిజర్వేషన్ బిల్లు వలన ముస్లింల కంటే తెరాస, భాజపాలకే ఎక్కువ ప్రయోజనం కలిగే అవకాశాలు కనబడుతున్నాయి. 

ఒకవేళ వచ్చే ఎన్నికలలో భాజపా-తెరాసలు పొత్తులు పెట్టుకోకపోతే, ఈ బిల్లునే భాజపా పైకి బ్రహ్మాస్త్రంలాగ ప్రయోగించవచ్చు. ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలనే తమ ప్రయత్నానికి కేంద్రప్రభుత్వం (భాజపా) సహకరించలేదని చెప్పుకొని ముస్లిం ప్రజల ఓట్లు సంపాదించుకోవచ్చు. 

ఈ బిల్లు మరో ప్రత్యేకత ఏమిటంటే భాజపాతో సహా అన్ని పార్టీలకు కూడా ఉపయోగించుకొనే వెసులుబాటు ఉండటమే.   ముస్లింలకు రిజర్వేషన్లను 12శాతానికి పెంచినట్లయితే తమకు నష్టం కలుగుతుందని భయపడుతున్న కొన్ని కులాల ప్రజలను భాజపా ఆకర్షించగలదు. ఆ బిల్లును అడ్డుకొన్నామని చెప్పి భాజపా హిందూ ఓటర్లను ఆకట్టుకొనే ప్రయత్నం చేయవచ్చు. భాజపాను ఎండగట్టి కాంగ్రెస్ పార్టీ తన సెక్యులర్ సర్టిఫికేట్ ను ప్రదర్శించుకోగలదు. వామపక్షాలు ఇప్పటికే ఆ పని చేస్తున్నాయి. మిగిలిన పార్టీలు కూడా వాడేసుకొని దానితో ఎంతో కొంత రాజకీయ లబ్ది పొందే ప్రయత్నం చేయవచ్చు. కనుక ముస్లిం రిజర్వేషన్ బిల్లు వలన ముస్లింల కంటే రాజకీయ పార్టీలకే ఎక్కువ ఉపయోగపడవచ్చు. 


Related Post