తెరాస సర్కార్ కు సహకరిస్తాం..పోరాడుతాం: భాజపా

April 08, 2017


img

రాష్ట్ర భాజపా శనివారం భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించింది. దానికి ముఖ్య అతిధిగా కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం పార్టీలకు అతీతంగా రాష్ట్రాలకు సహకారం అందిస్తోందని చెప్పారు. “సబ్ కా సాత్ సబ్ కా వికాస్” అనే విధానంతో దేశంలో అన్ని రాష్ట్రాలు సరిసమానంగా అన్ని రంగాలలో అభివృద్ది సాధించడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. అభివృద్ధిని రాజకీయాలతో ముడిపెట్టడం తమకు ఇష్టం లేదని తెలిపారు. అందుకే తెలంగాణా రాష్ట్రాభివృద్ధికి కూడా తమ ప్రభుత్వం చాలా సహకరిస్తోందని తెలిపారు. అయితే తెరాస సర్కార్ తీసుకొనే ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై రాష్ట్రంలో తమ పార్టీ గట్టిగా పోరాడుతుందని చెప్పారు. తెరాస సర్కార్ సెప్టెంబర్ 17న హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని జరపడానికి ఎందుకు వెనకాడుతోందని మంత్రి జవదేకర్ ప్రశ్నించారు. ఇప్పుడు దేశంలో భాజపా హవా వీస్తోందని, వచ్చే ఎన్నికలలో తెలంగాణాలో కూడా అధికారం దక్కించుకొనేందుకు ఇప్పటి నుంచే రాష్ట్ర భాజపా నేతలు, కార్యకర్తలు గట్టిగా కృషి చేయాలని కోరారు. 

రాజకీయాలకు, పార్టీ ప్రయోజనాలకు అతీతంగా అది రాష్ట్రాభివృద్ధికి కేంద్రప్రభుత్వం సహకరించడం హర్షణీయమే. అదే సమయంలో తెరాసను తమ పార్టీ వ్యతిరేకిస్తోందనే స్పష్టమైన సంకేతాలను భాజపా నేతలు బాగానే ఇస్తున్నారు. అయితే రాష్ట్ర భాజపా అధ్యక్షుడు లక్ష్మణ్ తెరాస సర్కార్ తో యుద్ధం చేస్తుంటే, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ ఎప్పుడు చూసినా కేసీఆర్ తో రాసుకుపూసుకు తిరుగుతుండటం అటు ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు కూడా తప్పుడు సంకేతాలు పంపిస్తోంది. 

భాజపా తన శక్తి సమార్ద్యాలను సరిగ్గా అంచనా వేసుకోలేకపోవడం, తెరాస పట్ల దాని వైఖరిలో కనబడుతున్న అయోమయం భాజపా ఎదుగుదలకు ప్రధాన అవరోధాలుగా కనబడుతున్నాయి. వాటిని అధిగమించినప్పుడే తెలంగాణా కలలు కనడం మంచిది లేకుంటే అవి ఎప్పటికీ పగటి కలలుగానే మిగిలిపోవచ్చు.   


Related Post