నోట్లు రద్దు చేసి ఏమి సాధించారు?

April 05, 2017


img

కేంద్రప్రభుత్వం పాత రూ.500,1000 నోట్లు రద్దు చేయడానికి కారణాలలో దేశంలో బారీ స్థాయిలో చలామణిలో ఉన్న నకిలీ కరెన్సీ బెడద వదిలించుకోవడం కూడా ఒకటి. కానీ 2-3 నెలలలోనే రూ.2,000 నోట్లకి కూడా నకిలీలు చలామణిలోకి వచ్చేశాయి. ఈ విషయాన్ని కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిరణ్ రిట్జూ ఈరోజు స్వయంగా పార్లమెంటులో అంగీకరించారు. అంటే మోడీ సర్కార్ ఆశించిన ప్రయోజనం సాధించలేకపోయిందని స్పష్టం అవుతోంది. పైగా నకిలీ వ్యాపారులు ఒక్క రూ.2,000 నకిలీ నోటును చలామణిలో పెట్టగలిగితే గతంలో కంటే తక్కువ సమయంలోనే ఎక్కువ లాభం పొందగలుగుతున్నారు. 

ఇక ఈ పెద్ద నోట్లను ప్రవేశపెట్టిన తరువాత దేశంలో నల్లధనం దాచుకొనేవారికి మరింత వెసులుబాటు కల్పించినట్లయింది. నోట్ల రద్దు తరువాత ఆదాయపన్ను శాఖ అధికారులకు పట్టుబడిన నల్లధనంమంతా కొత్త రూ.2,000 నోట్లు కావడమే అందుకు చక్కటి ఉదాహరణ. అంటే నోట్ల రద్దుతో నల్లధనం వెలికితీయాలనే రెండో ప్రయోజనం కూడా నెరవేరలేదని స్పష్టం అయ్యింది. 

ఇక ఉగ్రవాదులకు, మావోయిష్టులకు నగదు సరఫరాను, వారి ద్వారా చలామణి అవుతున్న నకిలీ కరెన్సీ అరికట్టాలనేది మోడీ సర్కార్ మరో ఆలోచన. కానీ నోట్ల రద్దు తరువాత కొద్ది రోజులు మాత్రమే జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల వద్ద ఉగ్రవాదులు, వేర్పాటువాదుల హడావుడి తగ్గింది. గత రెండు మూడు నెలల నుంచి మళ్ళీ యధాప్రకారం సరిహద్దులలో దాడులు, భద్రతాదళాలపై అల్లరి మూకలు రాళ్ళు రువ్వడాలు, పోలీసులపై మావోల దాడులు జరుగుతూనే ఉన్నాయి. అంటే ఆ ప్రయోజనం కూడా నెరవేరలేదని స్పష్టం అవుతోంది. 

చిట్ట చివరిగా నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించాలనే ఆలోచన కూడా విఫలమైంది. సరిపడినన్ని కొత్తనోట్లు మార్కెట్లలోకి వచ్చేయగానే నగదు రహిత లావాదేవీలు తగ్గిపోయాయి. నోట్ల రద్దు వలన వలన దేశానికి, దేశ ఆర్ధిక వ్యవస్థకు చాలా మేలు కలుగుతుందని సామాన్య ప్రజలు నమ్మి నానాకష్టాలు అనుభవించారు. ఇటీవల జరిగిన ఎన్నికలలో భాజపాను ఆదరించారు కూడా. కానీ అందుకు ప్రతిగా వారి రుణం తీర్చుకొనే ప్రయత్నం చేయకపోగా, వారిపై కేంద్రప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్, బ్యాంకులు అన్నీ పగబట్టినట్లు వ్యవహరిస్తున్నాయి.

నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టకుండా కృత్రిమ కరెన్సీ కొరతను సృష్టించడం చాలా దురదృష్టకరం. 

దాని వలన సామాన్య ప్రజలు బ్యాంకులో ఉన్న తమ కొద్దిపాటి డబ్బును లేదా జీతాలను తీసుకోలేక నానా కష్టాలు పడుతున్నారు. అయినా కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు, రిజర్వ్ బ్యాంక్ తమకు పట్టనట్లు వ్యవహరిస్తున్నాయి. నోట్ల రద్దు వలన భారతదేశ ఆర్ధిక వ్యవస్థ బలోపేతం అయ్యుంటే అందరికీ సంతోషమే. కానీ సామాన్య ప్రజలను ఈవిధంగా ఇబ్బందులకు గురి చేయడం సరికాదు. ప్రజల సహనం నశిస్తే ఏమవుతుందో తెలుసుకొనేందుకు కాంగ్రెస్ పార్టీ మన కళ్ళ ముందే ఉంది.


Related Post