ఎవరిని చెప్పుతో కొట్టాలి... హన్మంతన్నా?

April 05, 2017


img

ఎవరైనా పనులు చేయడానికి లంచం అడిగితే చెప్పుతో కొట్టమని ఐటి శాఖ మంత్రి కేటిఆర్ చెప్పారు. ఆయన లంచగొండులకు బుద్ధి చెప్పమని ప్రజలకు సూచిస్తున్నట్లు అర్ధం అవుతోంది. కానీ సీనియర్ కాంగ్రెస్ నేత వి హనుమంతరావు దానిని సాగదీసి ‘దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పిన కేసీఆర్ మాట తప్పలేదా? డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు కట్టిస్తామని, దళితులకు మూడెకరాల భూమిని ఇస్తానని ప్రజలను మోసం చేయలేదా? అవినీతి కంటే ప్రజలను మోసం చేయడమే పెద్ద నేరం. అవినీతిపరులను చెప్పుతో కొట్టమని కేటిఆర్ చెప్పినందుకు చాలా సంతోషం. అలాగే ప్రజలకు అబద్దాలు చెపుతూ మోసం చేస్తున్న వారిని కూడా చెప్పుతో కొట్టాలి,” అని హనుమంత రావు అన్నారు. 

ఎన్నికల హామీల అమలులో తెరాస సర్కార్ కొంత వెనుకబడిపోయిందేమో కానీ వాటిని అమలుచేయకుండా తప్పించుకొనే ఉద్దేశ్యం లేదని దాని చర్యలే స్పష్టం చేస్తున్నాయి. కేజీ టు పీజి అమలు చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని కొద్దిరోజుల క్రితమే శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. రాష్ట్రానికి మేలు చేసే ఒక గొప్ప ఆలోచన చేయడమే గొప్ప విషయం. దాని అమలుచేయడంలో అనేక సాధక బాధకాలు ఉంటాయి. వాటిని పరిష్కరించుకొని ముందుకు సాగుతున్నామని కేసీఆర్ చెప్పారు. దళితులకు మూడెకరాల భూమి హామీ కూడా అటువంటిదే. దానిలో అనేక సాంకేతిక, ఆర్ధిక, రాజకీయ అవరోధాలున్న కారణంగా ఆలస్యం అవుతోంది. కనుక అది సాద్యంకాకపోయినా ఆశ్చర్యం లేదు. 

ఇదివరకు కాంగ్రెస్ పార్టీ హయంలో హామీలు ఇవ్వడమే తప్ప ఏనాడూ వాటి గురించి కనీసం ఆలోచించేదికాదు. పైగా దాని పాలన అంటే అసమర్ధత, అవినీతికి మారుపేరుగా ఉండేది. ఆ కారణంగానే అది ఏనాడూ ఇలాగ లంచగొండు అధికారులను చెప్పుతో కొట్టమని ధైర్యంగా చెప్పలేకపోయింది. నాలుగున్నర దశాబ్దాలలో కేంద్రంలో రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలే అధికారంలో ఉన్నప్పటికీ చేయలేని అనేక పనులను, కేంద్రంలో, రాష్ట్రంలో బిన్న పార్టీల ప్రభుత్వాలు ఉన్నప్పటికీ చేసి చూపిస్తున్న సంగతి ప్రజలు కూడా గమనిస్తూనే ఉన్నారు. 

కాంగ్రెస్ తన హయంలో దేశానికి రాష్ట్రానికి ఏమి చేయలేకపోవడమే కాదు నేటికీ కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న పనులకు అడుగడుగునా అడ్డుపడుతూనే ఉంది. ఇక్కడ రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు కట్టకుండా కోర్టులో కేసులు వేస్తుంటే, అక్కడ పార్లమెంటులో బిల్లులు పాస్ కాకుండా అడ్డుపడుతోంది. ఒకప్పుడు కాంగ్రెస్ అంటే దేశ స్వాతంత్రం కోసం పోరాడిన గొప్ప పార్టీగా ప్రజలలో గౌరవం ఉండేది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే ‘ప్రగతి నిరోధక పార్టీ’ అనే అభిప్రాయం కలిగేలా వ్యవహరిస్తోంది. కనుకనే దానిని ఒక్కో రాష్ట్రంలో ప్రజలు తిరస్కరిస్తున్నారు. అయినా ఆ పార్టీ నేతల ఆలోచనలలో..వ్యవహార శైలిలో ఎటువంటి మార్పు కనబడకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. కాంగ్రెస్ తీరు చూస్తుంటే తమ పార్టీని తాము తప్ప ఇతరులు ఎవరూ ఓడించలేరని వారు చెప్పుకొనే మాటలు నిజమేననిపిస్తుంది. 


Related Post