జగన్ తప్పటడుగులు..

April 05, 2017


img

ఏపిలోని 20 మంది వైకాపా ఎమ్మెల్యేలను తెదేపాలోకి ఫిరాయింపజేసినప్పుడే ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేకపోయారు. తరువాత వారిలో నలుగురికి చంద్రబాబు నాయుడు మంత్రి పదవులు ఇస్తున్నారని తెలిసి ఉన్నప్పటికీ ఏమీ చేయకుండా చేతులు ముడుచుకొని చూస్తూ కూర్చొన్నారు. చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకొన్నట్లుగా ఇప్పుడు మేల్కొని ముఖ్యమంత్రి, స్పీకర్, గవర్నర్ నరసింహన్ లను విమర్శిస్తున్నారు. 

గవర్నర్ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారని విమర్శించి మళ్ళీ ఆయనకే జగన్ వినతి పత్రం ఇచ్చి రావడం విడ్డూరం అనుకొంటే, మళ్ళీ ఆయన మీద రాష్ట్రపతికి, వీలైతే ప్రధాని నరేంద్ర మోడీని, జాతీయ పార్టీల నేతలను కలిసి పిర్యాదు చేయడానికి జగన్ సిద్దం అవుతుండటం ఇంకా విడ్డూరంగా ఉంది. 

గతంలో తాను ఇచ్చిన ఏ వినతిపత్రాన్ని స్పీకర్, గవర్నర్, రాష్ట్రపతి పట్టించుకోలేదని తెలిసి ఉన్నప్పటికీ జగన్ మళ్ళీ డిల్లీ బయలుదేరాలనుకోవడం అనుమానాలకు కూడా తావిస్తోంది. ఇటీవల ఈడి అధికారులు డొల్ల కంపెనీలపై ఉదృతంగా దాడులు చేస్తుండటం వాటిలో జగన్ కు చెందిన కంపెనీలు కూడా ఉన్నట్లు వార్తలు వచ్చిన సంగతి అందరికీ తెలిసే ఉంటుంది. కనుక ఒకవేళ చంద్రబాబు నాయుడుపై పిర్యాదులు చేయడానికి డిల్లీ బయలుదేరితే, ఈడి దాడులు, జప్తుల సమస్యలను పరిష్కరించుకోవడానికే జగన్ ఈ సాకుతో డిల్లీ వెళుతున్నారని తెదేపా నేతలు ఆరోపించకుండా ఉండరు. కనుక జగన్ డిల్లీ పర్యటన వలన ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కట్టబెట్టడమనే సమస్య పరిష్కారం కాకపోగా దాని తీవ్రత తగ్గి సమస్య పక్కదారి పట్టడం ఖాయం. అంటే తెదేపా సర్కారును ఇరుకున పెట్టే ప్రయత్నంలో జగన్ స్వయంగా అది ఆ సమస్య నుంచి తప్పించుకొనేందుకు అవకాశం కల్పించడమే కాకుండా తిరిగి తనపై ఎదురుదాడి చేసే అవకాశం కూడా కల్పిస్తున్నారని చెప్పవచ్చు.   

కనుక ఈ సమస్యపై జగన్ నిజంగా పోరాడలచుకొన్నట్లయితే రాష్ట్రంలోనే పోరాడటం లేదా దీనిపై న్యాయపోరాటం చేసినట్లయితే ఏమైనా ఫలితం కనబడవచ్చు.


Related Post