కాంగ్రెస్ వ్యూహం ఫలిస్తుందా?

April 05, 2017


img

2014 ఎన్నికలలో స్వయంకృతాపరాధం వలన తెలంగాణాలో అధికారం చేజార్చుకొన్న కాంగ్రెస్ పార్టీ, 2019 ఎన్నికలలో ఎలాగైనా విజయం సాధించాలని అప్పుడే సన్నాహాలు ప్రారంభించింది. సీనియర్ కాంగ్రెస్ నేతలందరూ హైదరాబాద్ లో నిన్న సమావేశమయ్యి పార్టీ పరిస్థితి, అంతర్గత సమస్యలు, తెరాస సర్కార్ అప్రజాస్వామిక విధానాలు, 2019 ఎన్నికల వ్యూహాల గురించి సుమారు 6-7గంటల సేపు సుదీర్గంగా చర్చించడం విశేషం. 

దానిలో మూడు ముఖ్య నిర్ణయాలు తీసుకొన్నారు. 1. ఏడాది ముందుగానే ఎన్నికల మ్యానిఫెస్టోని విడుదల చేయడం 2. ఏడాది ముందుగానే 60-70 నియోజక వర్గాలలో కాంగ్రెస్ అభ్యర్ధుల పేర్లను సూత్రప్రాయంగా ఖరారు చేయడం. 3. ఉత్తం కుమార్ రెడ్డి నాయకత్వంలో అందరూ కలిసికట్టుగా పనిచేయడం. 

ఎన్నికలలో పోటీ చేయబోయే అభ్యర్ధుల పేర్లను ఏడాది ముందుగానే ఖరారు చేస్తామంటే పార్టీలో అందరికీ సంతోషమే. అప్పుడే ఎన్నికలు వచ్చేసినంత సంతోషపడటం ఖాయం కనుక అందరూ దానిని స్వాగతించవచ్చు. కానీ అభ్యర్ధుల పేర్లు ఖరారు చేసే అధికారం రాష్ట్ర కాంగ్రెస్ చేతిలో లేదనే సంగతి అందరికీ తెలిసిందే. వరుస ఓటములు వైఫల్యాల కారణంగా తీవ్ర నిరాశ నిస్పృహలో కూరుకుపోయున్న డిల్లీ పెద్దలు అందుకు అనుమతిస్తారో లేదో చూడాలి. ఒకవేళ అనుమతిస్తే, ఎన్నికలకు ముందు టికెట్ల కోసం మొదలయ్యే కొట్లాటలు ఏడాది ముందుగానే మొదలవుతాయి. 

ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిసిసి అధ్యక్షుడు కావాలని కలలు కంటున్నసంగతి తెలిసిందే. అయన ఉత్తం కుమార్ రెడ్డి నాయకత్వ లక్షణాలను ప్రశ్నిస్తున్నారు. ఆ పదవి నుంచి ఆయనను తప్పించి దానిని తనకు ఇవ్వాలని కోరుతున్నారు. తనకు ఇచ్చినట్లయితే 2019 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని తప్పకుండా గెలిపించి తీరుతానని భరోసా ఇస్తున్నారు. బహుశః ఆ ప్రయత్నాలలో భాగంగానే త్వరలోనే పాదయాత్ర చేయడానికి సిద్దం అవుతున్నారు. కనుక పార్టీలో అందరూ ఉత్తం కుమార్ రెడ్డి నేతృత్వంలోనే పని చేయాలనే నిర్ణయానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంతవరకు కట్టుబడి ఉంటారో చూడాలి. 

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల గురించి ఇప్పటి నుంచే కలలు కనేబదులు, ముందుగా పార్టీలో అంతర్గత సమస్యలను, నాయకుల మద్య విభేదాలను పరిష్కరించుకొని, బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసుకొనేందుకు గట్టి ప్రయత్నాలు చేసి ఉంటే ఎక్కువ ప్రయోజనం ఉండేదేమో?   


Related Post