దానికే ఇంత సంతోషపడాలా అన్నా?

April 04, 2017


img

ఒకప్పుడు సమైక్య రాష్ట్రాన్ని, దేశాన్ని ఎదురులేకుండా ఏలిన కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇప్పుడు ఏవిధంగా ఉందో అందరూ చూస్తూనే ఉన్నారు. ఒకప్పుడు ఎంపి, ఎమ్మెల్యే సీట్లను అవలీలగా గెలుచుకొన్న కాంగ్రెస్ పార్టీ మళ్ళీ చాలా రోజుల తరువాత నల్గొండ జిల్లా కనగల్ ఎంపిపి పీఠాన్ని గెలుచుకొంది. విచిత్రం ఏమిటంటే, తమ పరిస్థితి ఇంతగా దిగజారినందుకు కాంగ్రెస్ నేతలు బాధపడకపోగా అందుకు విజయోత్సవర్యాలీ నిర్వహించుకోవడం! బహుశః దానినే అల్పసంతోషం అంటారేమో?  

మండల కేంద్రంలో నిన్న జరిగిన ఈ విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అందుకు జబ్బలు చరుచుకొన్నారు. ఎంపి గుత్తా సుఖేందర్ రెడ్డి తన స్వంత గ్రామంలో సర్పంచ్ ను గెలిపించుకోలేనప్పుడు, కేసీఆర్ పోటీ చేస్తే ఆయనను గెలిపించుకొంటామని గుత్తా ఏవిధంగా చెపుతున్నారని ప్రశ్నించారు. ఒకవేళ కేసీఆర్ నిజంగానే నల్లగొండ నుంచి పోటీ చేస్తే ఆయనను తప్పకుండా ఓడిస్తానని కోమటిరెడ్డి సవాలు విసిరారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి తెరాస సర్కార్ వైఫల్యాలను ఎండగడతానని చెప్పారు. తన పాదయాత్రతో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి వచ్చే ఎన్నికలలో విజయం సాధించేలా చేస్తానని చెప్పారు. 

కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీ కోసమే ఈ మండు వేసవిలో పాదయాత్ర చేస్తానని చెపుతున్నప్పటికీ, ఆయన పిసిసి అధ్యక్ష పదవిపై కన్నేసి ఉన్నందున అధిష్టానం దృష్టిని ఆకర్షించేందుకే చేస్తున్నట్లు భావించవచ్చు. కష్టపడి పనిచేసి పార్టీలో పదవులు ఆశించడం తప్పేమీ కాదు కనుక ఈ పాదయాత్రతో స్వామి కార్యంతో బాటు స్వకార్యం కూడా పూర్తవుతుందని ఆశపడుతున్నట్లున్నారు కోమటిరెడ్డి. 

పిసిసి అధ్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి ఆయనలాగ పాదయాత్ర చేయలేక ‘కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చే వరకు గెడ్డం గీయనని’ ప్రతిజ్ఞ చేశారు. కనుక ఆయన కూడా కుర్చీని వదులుకోవాలనుకోవడం లేదని స్పష్టం అవుతోంది. 2014 ఎన్నికల సమయంలో ఆ కుర్చీ కోసమే కాంగ్రెస్ నేతలు అందరూ కీచులాడుకొంటూ త్రుటిలో అధికారం చేజార్చుకొన్నారు. కనుక మళ్ళీ ఆ కుర్చీలాటకు ఇప్పటి నుంచే రంగం సిద్దం అవుతున్నట్లు కనిపిస్తోంది. అంటే చరిత్ర పునరావృతం కాబోతోందా? అనే సందేహం కలుగుతోంది. 


Related Post