ఏపిలో కూడా తెరాస ప్రారంభం?

April 04, 2017


img

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణా విడిపోతే ఎంతో కాలం మనుగడ సాగించలేదని, ఎందుకంటే తెలంగాణా నేతలకి పరిపాలన రాదని, నక్సల్స్ పెరిగి శాంతిభద్రతల సమస్యలు పెరిగిపోతాయని ఆంధ్రా నేతలు వాదించేవారు. కానీ తెలంగాణా రాష్ట్రం ఏర్పడి మూడేళ్ళు కూడా పూర్తికాకమునుపే దేశంలో అభివృద్ధి చెందిన రాష్ట్రాలతో పోటీ పడేస్థాయికి ఎదగడమే కాకుండా, తెలంగాణా ప్రభుత్వం చేపడుతున్న అనేక ప్రాజెక్టుల కారణంగా అనేక రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా నిలుస్తోంది. అనేక అంశాలలో తెలంగాణా రాష్ట్రం నెంబర్: 1 నుంచి 10వ ర్యాంకులు సాధించుకొంటూనే ఉంది. శరవేగంగా సాగుతున్న ఈ అభివృద్ధిని ప్రతిపక్షాలు, కొన్ని ప్రజాసంఘాలు అంగీకరించకపోవచ్చు కానీ జాతీయ, అంతర్జాతీయస్థాయిలో తెలంగాణా ప్రభుత్వం ప్రశంశలు పొందుతూనే ఉండటం అందరూ చూస్తూనే ఉన్నారు. 

ఆంధ్రాకు చెందిన శివకుమార్ కెల్ల అనే ఒక యువకుడు మంత్రి కేటిఆర్ కు పెట్టిన ఒక తాజా ట్వీట్ చూస్తే ఈ వాదన నిజమని అర్ధం అవుతుంది. “మా రాష్ట్రంలో రాజకీయ పార్టీల, ప్రభుత్వ తీరుతో మేమందరం విసుగెత్తిపోయున్నాము. కనుక మీరు మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా తెరాసను ప్రారంభించాలని కోరుతున్నాను,” అని మెసేజ్ పెట్టాడు. 

దానికి కేటిఆర్ స్పందిస్తూ “ఇక్కడ మా రాష్ట్రంలో చేయవలసిన పనులు చాలా ఉన్నాయి బ్రదర్. మీ సానుకూల అభిప్రాయానికి కృతజ్ఞతలు,” అని బదులిచ్చారు. 

ఒకప్పుడు అధికారంలో ఉన్న పార్టీలు రాజకీయాలు చేయడమే గొప్ప విషయంగా భావించేవి. కానీ ఇప్పుడు రాష్ట్రాభివృద్ధి, సంక్షేమం చేసి చూడపడంలో పోటీలు పడుతున్నాయి. ఒకవేళ విఫలం అయితే ప్రజలు, ప్రతిపక్షాలు ఇదివరకులాగ మౌనంగా ఉండటం లేదు. గట్టిగా నిలదీసి అడుగుతున్నారు. 

ఏపి సిఎం చంద్రబాబు కూడా రాష్ట్రంలో 80 శాతం ప్రజలు సంతృప్తి చెందేవిధంగా తన పాలన ఉండాలని చెపుతుంటారు. కానీ ఆచరణలో అభివృద్ధి కనబడకపోవడంతో ప్రజలలో అసంతృప్తి నెలకొని ఉంది. అదే సమయంలో తెలంగాణా రాష్ట్రంలో శరవేగంగా సాగుతున్న అభివృద్ధి పనులను చూస్తునప్పుడు ఆ తేడా ఇంకా స్పష్టంగా కనబడుతోంది. అందుకే కేసీఆర్, కవిత ఆంధ్రాలో అడుగుపెట్టినప్పుడు ఆంధ్రా ప్రజలు వారికి సాదరంగా స్వాగతం పలికారని భావించవచ్చు. ఈ యువకుడు పెట్టిన చిన్న మెసేజ్ సారాంశం ఏమిటంటే రాష్ట్రాభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో పనిచేసే పార్టీ కావాలని కోరుకొంటున్నట్లుగా చెప్పవచ్చు. కేంద్రప్రభుత్వం లేదా మరే ఇతర సంస్థలు ఇచ్చిన అవార్డులు ర్యాంకుల కంటే ఈ యువకుడు పెట్టిన ఈ చిన్న మెసేజ్  తెరాస సర్కార్ పనితనానికి వచ్చిన గొప్ప గుర్తింపుగా భావించవచ్చు. కీప్ ఇట్ అప్ తెరాస సర్కార్! కీప్ ఇట్ అప్ కేటిఆర్! 



Related Post