ఆ చట్టాన్ని అమలు చేయడం కష్టం! అందుకే..

April 04, 2017


img

తెరాస సర్కార్ చేపడుతున్న అనేక ప్రాజెక్టులకు భూసేకరణ చట్టం 2013 ప్రకారమే భూసేకరణ చేయాలని కాంగ్రెస్ తో సహా ప్రతిపక్షాలు గట్టిగా పట్టుబడుతున్నాయి. కానీ భూసేకరణ కోసం జివో నెంబర్: 123 జారీ చేసి దాని ద్వారానే భూసేకరణ చేయడానికి తెరాస సర్కార్ ప్రయత్నిస్తోంది. అందుకు ప్రతిపక్షాలు అభ్యంతరాలు చెపుతూ కోర్టులలో కేసులు వేస్తున్నాయి. ఈ విషయంపై అధికార, ప్రతిపక్షాల మద్య సాగుతున్న వాగ్వాదాలను అందరూ చూస్తూనే ఉన్నారు. 

భూసేకరణ చట్టం 2013 ప్రకారమే భూసేకరణ చేయడానికి ప్రభుత్వం ఎందుకు వెనకాడుతోంది? అనే ప్రశ్నకు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు చెప్పిన సమాధానం ఆలోచింపజేసేదిగా ఉంది. కానీ అంతకంటే ముందు ఈ చట్టం రూపకల్పన, తదనంతర పరిణామాల గురించి కొంచెం చెప్పుకోవలసి ఉంటుంది.           

దేశంలో వివిధ అభివృద్ధి పనుల కోసం భూసేకరణ చేసినప్పుడు చాలా సందర్భాలలో సరైన నష్ట పరిహారం అందక నిర్వాసిత రైతులు తీవ్రంగా నష్టపోతుంటారు. వారి ప్రయోజనాలను కాపాడటానికి యూపియే ప్రభుత్వం 2013లో భూసేకరణ చట్టాన్ని తెచ్చింది. కానీ దానిలో ఉన్న కటినమైన నిబంధనల వలన ఇంతవరకు దేశంలో ఎక్కడా ఆ చట్ట ప్రకారం భూసేకరణ జరుగలేదు. కనుక భూసేకరణ ప్రక్రియను సులభతరం చేసేందుకు మోడీ ప్రభుత్వం దానికి కొన్ని సవరణలు చేయాలని ప్రయత్నించి విఫలమైంది. ఆర్డినెన్స్ ద్వారా కొన్ని నెలలు దానిని కొనసాగించింది కానీ ఆవిధంగా ఎక్కువ కాలం కొనసాగించడం సాధ్యం కాదు కనుక ఆ చట్టానికి సవరణలు చేసే ఆలోచనను విరమించుకొంది. క్లుప్తంగా ఇదీ భూసేకరణ చట్టం 2013 కధ. 

“రైతులకు న్యాయం చేయడం చాలా అవసరమే. తెలంగాణాలో రైతుల కోసమే ప్రాజెక్టులు నిర్మిస్తున్నప్పుడు వారిని మోసం చేయాలనే ఉద్దేశ్యం, కోరిక మా ప్రభుత్వానికి లేవు. కానీ ఆ చట్టంలో ఉన్న కటినమైన, ఆచరణ సాద్యం కాని నిబంధనలను ఏ ప్రభుత్వం అమలుచేయలేకనే ఈవిధంగా రాష్ట్ర స్థాయిలో కొత్త చట్టాలు రూపొందించుకోవలసి వస్తోంది. ఈ సంగతి ప్రతిపక్షాలు కూడా తెలుసు. అందుకే మా ప్రభుత్వం జివో నెంబర్: 123 జారీ చేయవలసి వచ్చింది. నిర్వాసిత రైతులకు నష్టపరిహారం చెల్లింపు విషయంలో, అ తరువాత కూడా వారికి ప్రభుత్వం అండగా నిలబడేవిధంగా దానిని రూపొందించాము. 

ఈ భూసేకరణ చట్టం 2013 ద్వారానే ఈ ప్రక్రియ చేయాలని పట్టుబడుతున్న ప్రతిపక్షాలు, అవి అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ఆ పద్దతిలో భూసేకరణ చేయడం లేదు. కానీ ఇక్కడ తమ రాజకీయ ప్రయోజనాల కోసం దానిని అమలుచేయాలని పట్టుబడుతూ కోర్టులలో కేసులు కూడా వేస్తున్నాయి. తెలంగాణా ఏర్పడిన తరువాత మన రైతన్నలకు, మన పంట పొలాలకు ఏవిధంగా నీళ్ళు అందించాలని అందరూ ఆలోచించాలి. కానీ మన స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రాజెక్టులను అడ్డుకోవాలనుకోవడం క్షమార్హం కాదు,” అని మంత్రి హరీష్ రావు చెప్పారు.


Related Post