భాజపాతో తెరాస దోస్తీ చేస్తుందా?

April 01, 2017


img

రెండు నెలల క్రితం వరకు తెరాస, భాజపాలు దగ్గరవుతున్నట్లే కనిపించాయి. కానీ ముస్లిం రిజర్వేషన్ బిల్లు ప్రస్తావన వచ్చిన తరువాత వాటి మద్య దూరం పెరిగింది. అయితే భాజపా నేతలు తెరాస సర్కార్ ను ఎంత తీవ్రంగా విమర్శిస్తున్నా తెరాస స్పందించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపాతో ఇప్పుడు కయ్యానికి కాలు దువ్వడం వలన కేంద్రం నుంచి రాష్ట్రానికి రావలసిన సహాయసహకారాలు నిలిచిపోయే ప్రమాదం ఉంటుందనే ఆలోచనతోనే తెరాస సంయమనం పాటిస్తున్నట్లు భావించవచ్చు.

అయితే తెరాస ఎల్లకాలం ఇలాగే సహనంగా ఉంటుందని ఆశించడం అవివేకమే. ఎన్నికలు దగ్గర పడిన తరువాత భాజపాతో సమీకరణాలు కుదిరితే మంచిదే లేకుంటే భాజపాపై తెరాస యుద్ధం ప్రకటించడం తధ్యం. అప్పుడు తెరాస ధాటికి భాజపా నిలువలేకపోవచ్చు. ప్రస్తుతం భాజపాదే పైచెయ్యిగా ఉన్నందున ఆ పార్టీ నేతలు తెరాస సర్కార్ పై నిత్యం విరుచుకుపడుతున్నారు. పైగా ఇటీవల జరిగిన ఎన్నికలలో నాలుగు రాష్ట్రాలలో భాజపా అధికారం కైవసం చేసుకోవడం, ముఖ్యంగా కీలకమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఊహించని స్థాయి మెజార్టీతో అధికారంలోకి రావడంతో రాష్ట్ర భాజపా నేతలు మంచి ఉత్సాహంగా ఉన్నారు. బహుశః అందుకే తెరాస సర్కార్ పై చెలరేగిపోతున్నారు. యూపి అయిపోయింది ఇక తరువాత తెలంగాణా వంతు అన్నట్లు మాట్లాడుతున్నారు.

అయితే మోడీ మ్యాజిక్ తెలంగాణాలో పనిచేయదనే 2014 ఎన్నికలలోనే రుజువయింది. అయినా రాష్ట్ర భాజపా నేతలు 2019 ఎన్నికలలో తామే విజయం సాధించబోతున్నామని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. కానీ నిజమేమిటో వారికీ తెలుసు. 

నిజానికి తెరాస తమ పార్టీతో పొత్తులు పెట్టుకొనేందుకు అంగీకరిస్తే వారు చాలా సంతోషించవచ్చు.కానీ అటువంటి ఆలోచనలు, ప్రయత్నాలు చేయడానికి ఇంకా చాలా సమయం ఉంది కనుక అంతవరకు తమ ఉనికిని కాపాడుకోవడానికే తమకు కొట్టిన పిండివంటి మతం అంశాన్ని తీసుకొని తెరాస సర్కార్ తో యుద్ధం చేస్తున్నారని చెప్పవచ్చు. 

ఎన్నికల నాటికి తెరాస, భాజపాలు చేతులు కలిపేందుకు తగిన వాతావరణం సృష్టించుకోవచ్చు. అవి చేతులు కలిపితే రెండూ లబ్ది పొందవచ్చు. తెరాస కేంద్రంలో, భాజపా రాష్ట్రంలో అధికారంలో భాగస్వాములు కావచ్చు. ఒకవేళ తెరాస అందుకు ఆసక్తి చూపకపోతే నష్టపోయేది భాజపాయే తప్ప తెరాస మాత్రం కాదు. అది రాష్ట్రంలో తెదేపాను కూడా దూరం చేసుకొన్న తరువాత ఇంకా బలహీనపడింది. వచ్చే ఎన్నికలలో అది ఒంటరిగా తెరాస, కాంగ్రెస్, తెదేపా, మజ్లీస్, వామపక్షాలను ఎదుర్కోవలసి ఉంటుంది. రాష్ట్ర భాజపాకు అంత శక్తి ఉందనుకోలేము. కనుక వచ్చే ఎన్నికలలో భాజపాకు తెరాస అండ చాలా అవసరమే. 


Related Post