కేంద్రం సంచలన ప్రకటన!

March 31, 2017


img

కేంద్రప్రభుత్వం ఈరోజు సాయంత్రం ఒక సంచలన ప్రకటన చేసింది. గత ఏడాది పాతనోట్ల రద్దు చేసిన తరువాత నవంబర్ 9 నుంచి డిశంబర్ 30వ తేదీలోగా రూ.2 లక్షలు కంటే ఎక్కువ మొత్తాలను తమ బ్యాంక్ ఖాతాలలో జమా చేసినవారందరూ విధిగా ఐటి రిటర్న్స్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ ఆర్ధిక సంవత్సరం ఐటి రిటర్న్ దరఖాస్తులో దీని కోసం ప్రత్యేకంగా ఒక కాలమ్ కేటాయించినట్లు పేర్కొంది.   

పాతనోట్ల రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించినప్పుడు సామాన్య ప్రజలు తమ బ్యాంక్ ఖాతాలలో రూ.2.5 లక్షల వరకు నిశ్చింతగా జమా చేసుకోవచ్చని, దానికి వారు ఎవరికీ సంజాయిషీ ఈయనవసరం లేదని చెప్పారు. ఆ మాత్రం డబ్బు చాలా మంది వద్ద ఉండే అవకాశం ఉండవచ్చనే ఉద్దేశ్యంతోనే ఆ మినహాయింపు ఇస్తున్నట్లు చెప్పారు. సరిగ్గా దీనినే నల్లకుభేరులు ఒక అవకాశంగా మలచుకొని తమ వద్ద పనిచేసేవారు, తమకు తెలిసిన పేద, మధ్యతరగతి బంధుమిత్రులకు కొద్దిగా కమీషన్ ఇచ్చి వారి బ్యాంక్ ఖాతాలలో తమ వద్ద ఉన్న నల్లధనాన్ని రెండున్నర లక్షల చొప్పున జమా చేసి, దానిని కొత్తనోట్లుగా మార్పిడి చేసుకొని వెనక్కు తీసేసుకొన్నారు. 

అటువంటి వారికి సహకరించవద్దని కేంద్రప్రభుత్వం, ఆదాయపన్ను శాఖ పదేపదే హెచ్చరించినప్పటికీ అంత సొమ్ముకు మినహాయింపు ఉంటుందని సాక్షాత్ ప్రధాని మోడీయే చెప్పినందున చాలా మంది వారి హెచ్చరికలను పెడచెవినపెట్టి నల్లకుభేరులకు సహకరించారు. అటువంటివారందరూ ఇప్పుడు తాము బ్యాంకులో జమా చేసిన ఆ డబ్బుకు లెక్కలు చూపించవలసి ఉంటుంది లేకుంటే సమస్యలు తప్పకపోవచ్చు. 

అయితే ప్రధాని మోడీ రూ.2.5 లక్షల వరకు జమా చేసుకోవచ్చని చెప్పి ఇప్పుడు రెండు లక్షలకు మించిన జమాలపై ఐటి రిటర్న్స్ కోరడం సబబు కాదనే చెప్పాలి. ఈవిధంగా కూడా మరికొందరు నల్లకుభేరులను పట్టుకోవాలని అయన ఆలోచణ కావచ్చు కానీ దీని వలన సామాన్య ప్రజలే ఎక్కువ ఇబ్బందులు పాలయ్యే అవకాశాలున్నాయి.


Related Post