పవన్ కళ్యాణ్ అభిప్రాయం నిజమేననిపిస్తుంది

March 31, 2017


img

తమిళనాడుకు చెందిన కొందరు రైతులు గత 18 రోజులుగా న్యూడిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తున్నారు. యూపిలో రైతులకు పంటరుణాలు మాఫీ చేసినట్లుగానే తమ రుణాలను కూడా మాఫీ చేయాలని వారు కోరుతున్నారు. అన్ని రోజులుగా వారు అక్కడ దీక్షలు చేస్తున్నా ఇంతవరకు కేంద్రప్రభుత్వం స్పందించలేదు. తమిళనాడు ఎంపిలు కొందరు వచ్చి వారికి సంఘీభావం ప్రకటించి వెళ్ళారు. 

ఈరోజు రాహుల్ గాంధీ అక్కడికి వచ్చి రైతులకు సంఘీభావం ప్రకటించారు. షరా మామూలుగానే ఆయన ప్రధాని నరేంద్ర మోడీ, ఆయన ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మోడీకి సంపన్నులు, కార్పోరేట్ సంస్థలపై ఉన్న ప్రేమ దేశానికి అన్నం పెడుతున్న రైతన్నపై లేదని విమర్శించారు. దేశంలో రైతులు విలవిలలాడుతుంటే, మోడీ వారిని పట్టించుకోకుండా సంపన్నుల పల్లకీని మోయడంలో ఆనందం అనుభవిస్తున్నారని విమర్శించారు. కేంద్రప్రభుత్వం తక్షణం రైతులకు కరువు సహాయం ప్రకటించి వారిని ఆదుకోవాలని కోరారు. 

ఆయన విమర్శలపై కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం రైతులు ఎదుర్కొంటున్న నీటి సంక్షోభం, ఆర్ధిక సమస్యలు, ఆ కారణంగా వారి ఆత్మహత్యలు అన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం చలవేనని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ చేసిన తప్పులను తమ ప్రభుత్వం ఒకటొకటిగా సవరించుకొని వస్తోందని అన్నారు. మోడీ రైతు, పేద ప్రజల పక్షపాతి..వారి సంక్షేమం అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారని చెప్పారు. రాహుల్ గాంధీ ఒక విఫలమైన పార్టీకి విఫల నాయకుడు. అటువంటి వ్యక్తి మోడీని విమర్శించడం హాస్యాస్పదంగా ఉందని ప్రకాష్ జవదేకర్ అన్నారు. 

రాహుల్ మోడీపై విమర్శలు చేయడం, ప్రకాష్ జవదేకర్ ప్రతివిమర్శలు చేయడం మామూలు విషయమే. కానీ గత 18 రోజులుగా తమిళనాడు రైతులు తన కళ్ళ ముందే దీక్షలు చేస్తున్నా పట్టించుకోని ప్రధాని మోడీ ఏవిధంగా రైతు పక్షపాతి అవుతారో తెలియదు. అంతే కాదు..18 రోజులుగా తమిళరైతులను ఎవరూ పట్టించుకోకపోవడం చూస్తుంటే ఉత్తరాది పాలకులకు దక్షిణాది ప్రజలంటే చులకన భావం ఉందనే పవన్ కళ్యాణ్ మాటలు కూడా నిజమేననిపిస్తుంది. 


Related Post