కేసీఆర్ వాళ్ళకి మేలు కాదు..మోసం చేస్తున్నారు!

March 31, 2017


img

ముఖ్యమంత్రి కేసీఆర్ పై రాష్ట్ర భాజపా అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ తీవ్ర విమర్శలు చేశారు. ఘట్ కేసర్ వద్ద నిన్న జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, “తెరాస సర్కార్ కోరిన వెంటనే కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి ఎయిమ్స్ ఆసుపత్రిని మంజూరు చేసింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పధకం క్రింద రాష్ట్రంలోని పేదలకు ఇళ్ళు, సడక్ యోజన క్రింద రాష్ట్రం జాతీయ రహదారుల నిర్మాణానికి రూ.48,000 కోట్లు మంజూరు చేసింది. భువనగిరి, నిజామాబాద్ లలో చెరొక కేంద్రీయ విద్యాలయాన్ని ఏర్పాటు చేయబోతోంది. కేంద్రప్రభుత్వం ఎప్పటికప్పుడు తెలంగాణా రాష్ట్రానికి కావలసిన సహాయసహకారాలు అందిస్తున్నప్పటికీ, కేంద్రం పంపిస్తున్న నిధులను ఒకపక్క అందుకొని వాటిని పక్కదారి పట్టిస్తూనే మళ్ళీ కేంద్రాన్ని తిట్టడం తెరాస సర్కార్ కు ఒక దురలవాటుగా మారిపోయింది. కేంద్రప్రభుత్వం చేపడుతున్న అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల వలన ప్రధాని నరేంద్ర మోడీకి దేశవ్యాప్తంగా క్రమంగా ఆదరణ పెరుగుతోంది. రాష్ట్రంలోని భాజపా కార్యకర్తలు, నేతలు అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొంటూ వచ్చే ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా ఇప్పటి నుంచే కష్టపడి పనిచేయాలి, “ అని అన్నారు. 

ముస్లిం రిజర్వేషన్ బిల్లు గురించి మాట్లాడుతూ “ముఖ్యమంత్రి కేసీఆర్ ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తానని హామీ ఇస్తూ వారి శ్రేయోభిలాషిలాగ నటిస్తున్నారు. రాజ్యాంగం ప్రకారం మతపరమైన రిజర్వేషన్లు కల్పించడానికి వీలు లేదు. అలాగే ఇది ఆయన పరిధిలో కూడా లేని అంశమే. కానీ ఆయన ముస్లింలకు హామీ ఇస్తున్నారు. అంటే ఆయన వారిని మోసం చేస్తున్నట్లే భావించవచ్చు. రాజ్యాంగ విరుద్దమైన ఆ అంశాన్ని మేము అందుకే వ్యతిరేకిస్తున్నాము,” అని అన్నారు. 


Related Post