అప్పుడు నోట్లు రద్దు..ఇప్పుడు వాహనాలు రద్దు...

March 31, 2017


img

రేపటి నుంచి అంటే ఏప్రిల్ 1వ తేదీ నుంచి భారత్ స్టేజ్-3 నాణ్యతా ప్రమాణాలు గల అన్ని రకాల వాహనాల అమ్మకాలను, రిజిస్ట్రేషన్లను నిషేదిస్తున్నట్లు సుప్రీంకోర్టు చెప్పిన తీర్పుతో వాహన తయారీ సంస్థలు, వాటి డీలర్లు ఉలిక్కిపడ్డారు. ఎందుకంటే దేశవ్యాప్తంగా కొన్ని లక్షల (భారత్ స్టేజ్-3) వాహనాలు తయారై అమ్మకానికి సిద్దంగా ఉన్నాయి. వాటినన్నిటినీ వెనక్కి రప్పించుకొని భారత్ స్టేజ్-4నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేయడం చాలా కష్టం. దాని వలన తయారీ సంస్థలకు తీవ్ర నష్టాలు కలుగుతాయి. అలాగని ఈ ఒక్కరోజులో ఎంత కష్టపడినా అన్ని వాహనాలను అమ్ముకోవడం కూడా కష్టమే. సుప్రీం తీర్పు పాత నోట్ల రద్దు నిర్ణయం వంటిదేనని చెప్పవచ్చు. ఇప్పటికే నోట్ల రద్దుతో ఒకసారి బారీగా నష్టపోయిన వాహన తయారీసంస్థలు ఇప్పుడు మరో భారీ నష్టాన్ని భరించగలిగే స్థితిలో లేవు. కానీ అవి నష్టపోవడం అనివార్యంగా కనిపిస్తోంది. 

దీనిపై వాహన తయారీ సంస్థలు సుప్రీంకోర్టులో ఒక రివ్యూ పిటిషన్ వేశాయి. కానీ ఈవిషయంలో మొదటే కటినంగా నిర్ణయం ప్రకటించిన సుప్రీంకోర్టు తన నిర్ణయాన్ని మార్చుకొంటుందని ఆశించలేము. 

దేశంలోని ఆటోమొబైల్ పరిశ్రమ అభివృద్ధి చెందడానికి ఒకవైపు ప్రభుత్వాలు ప్రోత్సహిస్తుంటే, మరోవైపు న్యాయస్థానాలు హటాత్తుగా ఇటువంటి నిర్ణయాలు ప్రకటించడం విస్మయం కలిగిస్తుంది. దేశంలో నానాటికి పెరిగిపోతున్న వాహనాల కారణంగా వాయుకాలుష్యం కూడా చాలా విపరీతంగా పెరిగిపోతోంది. దానిని నియంత్రించేందుకు అన్ని రాష్ట్రాలలో కటినమైన చట్టాలు, వాటిని అమలుచేసేందుకు కాలుష్యనియంత్రణ మండలి, రవాణాశాఖ, ట్రాఫిక్ పోలీస్ వంటి అనేక వ్యవస్థలు ఉన్నాయి. కానీ ఆ వ్యవస్థలు చట్టాలను అమలుచేయలేకపోయాయి. 

కాలుష్య నియంత్రణకు కటిన నిర్ణయాలు తప్పకుండా అవసరమే. కానీ నిరంతరంగా కాలుష్యనివారణ చర్యలు చేపట్టకుండా హటాత్తుగా ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం పారిశ్రామిక ప్రగతికి గొడ్డలిపెట్టుగా మారడమే కాకుండా కొత్తగా పరిశ్రమలు స్థాపించాలనుకొంటున్నవారికి తప్పుడు సంకేతాలు పంపించి వారు వెనకడుగువేసేలా చేస్తుంది. నిజానికి వాహనాల వలన ఇతర పరిశ్రమల వలన కలిగే కాలుష్యం నియంత్రించడం కోసం ఆ సంస్థలపై ఇటువంటి చర్యలు తీసుకోవడం కంటే వాటిని నిరంతరంగా పర్యవేక్షిస్తూ, నియంత్రించవలసిన కాలుష్యనివారణమండలి వంటి వ్యవస్థలు తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తునందుకు వాటిని బాధ్యులుగా చేసి సంబందిత అధికారులపై న్యాయస్థానాలు కటినచర్యలు తీసుకొన్నట్లయితే ఎక్కువ ప్రయోజనం కలిగి ఉండేదేమో? సుప్రీంకోర్టు తీర్పుతో కొత్త వాహనాల కాలుష్య నియంత్రణ సాధ్యం కావచ్చు కానీ ఆర్.టి.సి. వంటి ప్రభుత్వ సంస్థలే అత్యంత కాలుష్యం వెదజిమ్మే బస్సులను నడిపిస్తున్నప్పుడు, దేశంలో కోట్లాది ప్రభుత్వ, ప్రైవేట్ వాహనాలు కాలుష్యం సృష్టిస్తున్నప్పుడు వాటిని అరికట్టకుండా ఈ ఒక్క నిర్ణయంతో కాలుష్యనివారణ సాధ్యమేనా? కాలుష్య నివారణలో ప్రభుత్వాల బాధ్యత ఏమి ఉండదా..లేదా? అందరూ ఆలోచించాలి. 


Related Post