పట్టాభిషేకానికి తొందరేముంది?

March 31, 2017


img

కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికలను నిర్వహించడానికి మరొక 6 నెలలు సమయం కావాలని ఎన్నికల కమీషన్ ను తమ పార్టీ కోరడాన్ని ఆ పార్టీ ఎంపి రేణుకా చౌదరి గట్టిగా సమర్ధించుకొన్నారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ, “మాది కొన్ని కోట్లు మంది సభ్యులున్న అతిపెద్ద జాతీయపార్టీ. కనుక సంస్థాగత ఎన్నికల నిర్వహణ ప్రక్రియ చాల బారీ కార్యక్రమంగా భావించవచ్చు. కనుక దానికి తగినంత సమయం తీసుకొని నిర్వహించాలనుకోవడం తప్పేమీ కాదు. ఇక రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టాలని పార్టీలో చాలా మంది కోరుకొంటున్నారు. అయితే దానికేమి తొందర లేదు. తగిన సమయం చూసుకొని ఆయన తప్పకుండా పార్టీ బాధ్యతలు చేపడతారు. అయినా ఇది మా పార్టీ అంతర్గత వ్యవహారం. దీని గురించి ఇతరులు ఎవరూ ఆలోచించనవసరం లేదు,” అని అన్నారు.

నిజమే..రాహుల్ గాంధీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టాలా వద్దా? చేపట్టేమాటయితే ఎప్పుడు చేపట్టాలి? అనేవి ఆ పార్టీ అంతర్గతవ్యవహారమే. పార్టీలో సీనియర్లు చాలా మంది ఆయన నాయకత్వాన్ని అంగీకరించడం లేదు కనుకనే ఆలస్యం జరుగుతోందని ఇప్పటికే  ఊహాగానాలు వినిపిస్తునాయి. ఆలస్యం అవుతున్న కొద్దీ అవి ఇంకా పెరుగుతుంటాయి. రేణుకా చౌదరి చెపుతున్నట్లుగా ఒకవేళ పార్టీలో అందరూ రాహుల్ గాంధీ పార్టీకి నాయకత్వం వహించాలని కోరుకొంటున్నట్లయితే ఇక ఆలస్యం ఎందుకు చేస్తున్నట్లు? అనే సందేహం కలుగుతుంది. ఒకవేళ అటువంటి ప్రయత్నం చేస్తే పార్టీలో చీలిక వస్తుందని భయపడుతున్నట్లయితే, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసుకొని చర్చించుకొని నిర్ణయం తీసుకోవడం మంచిది కదా? ఇలాగే ఏదో ఒక సాకుతో రాహుల్ గాంధీకి పట్టాభిషేకం చేసుకోవడానికి వెనుకంజ వేస్తే ఇదివరకు ప్రధానమంత్రి పదవి చేజారిపోయినట్లే ఈ పదవి కూడా చేజారిపోయే ప్రమాదం ఉంటుంది.


Related Post