వాళ్ళు చేస్తున్న తప్పులే మనం చేస్తున్నామా?

March 30, 2017


img

అమెరికా లేదా ఆస్ట్రేలియా దేశాలలో భారతీయులపై దాడులు జరిగితే ఇక్కడ అందరం బాధపడుతుంటాము. జాత్యాహంకారదాడులని అందరం గట్టిగా ఖండిస్తాము. కానీ ఇటీవల హైదరాబాద్, మీరట్,  నోయిడాలో నైజీరియన్ దేశస్థులపై జరుగుతున్న దాడులను చూస్తుంటే అక్కడ అమెరికా, ఆస్ట్రేలియా దేశాలలో జాత్యాహంకారులు చేస్తున్న తప్పులనే ఇక్కడ భారత్ లో మనం కూడా చేస్తున్నామా? అనే సందేహం కలుగుతుంది. భారతదేశంలో ఉన్నత విద్యలభ్యసించడానికి లేదా వేరే ఇతర పనుల మీద వస్తున్నవారిలో కొద్ది మంది డ్రగ్స్ సరఫరా, అమ్మకాలు చేస్తుండవచ్చు. కనుక నైజీరియన్లు అందరూ మత్తుమందులు అమ్ముకొనేవారేనని భావిస్తూ వారిపై దాడులు చేయడం, ముస్లింలు అందరూ తీవ్రవాదులేనని భావిస్తూ ఆరు ముస్లిం దేశాలపై నిషేధం విధించిన ట్రంప్ విపరీత ఆలోచనలాగే ఉంది.

డిల్లీ సమీపంలోగల గ్రేటర్ నోయిడాలో ఉన్నత విద్యలభ్యసించడానికి వచ్చిన కొందరు నైజీరియన్ విద్యార్దులపై కొందరు స్థానికులు దాడి చేయడంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటనపై నైజీరియన్ ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, తమ విద్యార్ధులకు ప్రభుత్వం భద్రత కల్పించాలని వారిపై దాడులకు పాల్పడినవారిని శిక్షించాలని భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ను కోరింది. ఆమె తక్షణమే యూపి ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ యోగికి ఈ విషయం తెలియజేసి దోషులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవలసిందిగా కోరారు. ఒకవేళ వారు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నట్లు అనుమానం కలిగితే ఆ విషయం పోలీసులకు తెలియజేయాలి తప్ప చట్టాన్ని మన చేతులలోకి తీసుకొని వారిపై దాడులు చేయడం సరికాదు. అలాగే పోలీసులు కూడా ఎటువంటి దర్యాప్తు జరుపకుండానే ఐదుగురు ఆఫ్రికన్ విద్యార్ధులను అరెస్ట్ చేయడం కూడా తప్పే. ఇటువంటి సంఘటనలు భారత్ ప్రతిష్టకు భంగం కలిగిస్తాయని అందరూ గుర్తుంచుకోవాలి. 


Related Post