అమరావతి గ్రాఫిక్స్ కే పరిమితమా?

March 25, 2017


img

బాహుబలి సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో చెప్పగలం కానీ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం ఎప్పుడు మొదలవుతుందో ఎవరూ చెప్పలేరని వైకాపా ఎమ్మెల్యే రోజా ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు కూడా బాహుబలి సినిమాలోలాగే గ్రాఫిక్స్ తో అందమైన అమరావతిని ప్రజలకు చూపిస్తూ మభ్యపెడుతూ మూడేళ్ళు దొర్లించేసారని ఇంకా అమరావతి నిర్మాణం ఎప్పుడు మొదలుపెడతారో తెలియడంలేదని అన్నారు. ఎప్పుడు కడతారో..అసలు కడతారో లేదో కూడా తెలియని అమరావతి డ్రాయింగులను గీయించుకొచ్చి మళ్ళీ గొప్పగా శాసనసభలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ చేయడం అంటే విలువైన సభా సమయం వృధా చేయడమేనని విమర్శించారు. 

వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా ఇంచుమించు అటువంటి అభిప్రాయమే వ్యక్తం చేశారు. మూడేళ్ళు గడిచిపోతున్నా ఇంతవరకు ఒక్క ఇటుక కూడా అక్కడ పెట్టలేదని, ఇంకా ఎంతకాలం ఎవరిని మోసం చేద్దామని శాసనసభలో దానిపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇస్తున్నారని జగన్ ప్రశ్నించారు. ఇది అందరినీ మభ్యపెట్టడానికి ఆడుతున్న కొత్త నాటకమని భావిస్తున్నందునే తాము సభ నుంచి బయటకు వచ్చేశామని జగన్ చెప్పారు. 

ఇదివరకు అమరావతి మాష్టర్ ప్లాన్ ను సింగపూర్ కంపెనీ చేత గీయించుకొచ్చిన తెదేపా సర్కార్ ఇప్పుడు దానిలో నిర్మించబోయే భవనాల డ్రాయింగులను బ్రిటన్ కంపెనీ చేత గీయించుకొంటోంది. మన సంస్కృతీ సంప్రదాయాలను, తెలుగుదనం ప్రతిబింబించే విధంగా, వాస్తుకు పూర్తి అనుగుణంగా భవనాల డ్రాయింగులు గీసే భాధ్యత వాటి గురించి ఏమాత్రం అవగాహన లేని బ్రిటిష్ వాళ్ళ చేత గీయించాలనుకోవడమే చాలా విడ్డూరంగా ఉంది. 


Related Post