కేసీఆర్ ఇంటిపై తెదేపా జెండా ఎగరాలిట!

March 25, 2017


img

తెలంగాణాలో తెదేపా పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలుసు. రాష్ట్రంలో తెదేపా అంటే ‘ఒన్ మ్యాన్ ఆర్మీ’ లాగ రేవంత్ రెడ్డి ఒక్కరే కనబడుతుంటారు. మిగిలినవారు అప్పుడప్పుడు పార్టీ ప్రధాన కార్యాలయంలో మాత్రమే కనిపిస్తుంటారు. ఈ నెల 29న తెదేపా ఆవిర్భావదినోత్సం కనుక తెలంగాణా తెదేపా నేతలు పార్టీ ప్రధాన కార్యాలయంలో సమావేశమయ్యి, యధాప్రకారం తెరాస సర్కార్ పై, ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శలు గుప్పించిన తరువాత 2019 ఎన్నికలలో తెదేపాదే విజయం అని ఘర్జించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ మరొకడుగు ముందుకు వేసి వచ్చే ఎన్నికలలో విజయం సాధించి కేసీఆర్ ఇంటిపై (ప్రగతి భవన్) తెదేపా జెండా రెపరెపలాడాలని అభిలషించారు. కనుక ఇప్పటి నుంచే పార్టీని మళ్ళీ గ్రామస్థాయి నుంచి బలోపేతం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అందుకోసం జిల్లాస్థాయి నుంచి గ్రామస్థాయి వరకు కమిటీలు ఏర్పాటు చేయాలని నేతలను కోరారు. 

తెదేపా ఒక రాజకీయ పార్టీ కనుక ఎన్నికలలో పోటీ చేసి గెలవాలనుకోవడంలో తప్పు లేదు. కానీ ముందుగా రాష్ట్రంలో తమ పార్టీ వాస్తవ పరిస్థితి ఏవిధంగా ఉంది?ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పోటీ చేయడానికి పార్టీలో సరిపడినంత మంది అభ్యర్దులైనా ఉన్నారా లేదా? నానాటికీ బలపడుతున్న అధికార తెరాసను ఎదుర్కొనే శక్తి తమ పార్టీకి నిజంగా ఉందా లేదా? లేకుంటే ఏమి చేయాలి? అని ఆలోచించి తదనుగుణంగా నిర్ణయాలు తీసుకొని ఉంటే ఎక్కువ ప్రయోజనం ఉండేది. కానీ ఏ ప్రయత్నం చేయకుండా ‘వచ్చే ఎన్నికలలో తెదేపాదే విజయం.. కేసీఆర్ ఇంటి మీద తెదేపా జెండా ఎగరాలి’ అని పగటికలలుకంటూ కాలక్షేపం చేస్తే వచ్చే ఎన్నికల తరువాత తెలంగాణాలో ఎక్కడా తెదేపా జెండా కనబడకపోవచ్చు. కనుక రమణ చెప్పినట్లు ఇప్పటి నుంచే పార్టీని బలోపేతం చేసుకొనే ప్రయత్నాలు మొదలుపెడితే మంచిది. అది సాధ్యం కాదనుకొంటే వచ్చే ఎన్నికల తరువాత తమ రాజకీయ పరిస్థితి ఏమిటి? తమ భవిష్యత్ ఏమిటి? అని తెదేపా నేతలు ఆలోచించడం మంచిదేమో?


Related Post