రైతు గతి ఎప్పుడూ ఇంతేనా?

March 25, 2017


img

అందరికీ అన్నం పెట్టే అన్నదాత రైతుకు దుక్కి దున్నడం మొదలు పండిన పంటను అమ్ముకొనే వరకు అన్నీ అగ్నిపరీక్షలే. సకాలంలో వానలు పడతాయో లేదో తెలియదు. బ్యాంకులు రుణాలు ఇస్తాయో లేదో తెలియదు. విత్తనాలు, ఎరువులు అసలైనవో నకిలివో తెలియదు. పండిన పంట చేతికి వస్తుందో లేదో తెలియదు. చేతికి అందిన పంటకు మార్కెట్లో గిట్టుబాటు ధర వస్తుందో రాదో తెలియదు. ఇదీ మన దేశంలో సగటు రైతు పరిస్థితి. ఇదే మరోమారు వరంగల్ లో ఎనుమామూరు మార్కెట్ యార్డులో నిన్న కళ్ళకు కట్టినట్లు కనబడింది. 

మిర్చి పంట సాగులో ఎన్ని కష్టాలు ఉన్నాయో వాటిని పండించే రైతులకే తెలుసు. జిల్లా పరిధిలోని కొప్పుల గ్రామానికి చెందిన రైతులు దుప్పటి యాదవరెడ్డి, తిరుపతి, బుచ్చిరెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, వెంకన్న, ఆదిరెడ్డి మరికొందరు రైతులు నాణ్యమైన తేజ రకం మిర్చిని మొన్న మార్కెట్ యార్డుకు తీసుకు వచ్చారు. దానికి టన్నుకు కనీసం రూ.8-9,000లు వస్తే తప్ప రైతులకు గిట్టుబాటు కాదు. కానీ అడ్తిదారు టన్నుకు కేవలం రూ.5,000 మాత్రమే వస్తుందని చెప్పడంతో వారు తీవ్ర ఆగ్రహం, అవేధనతో రెండు బస్తాల మిర్చీని అక్కడే కుప్ప పోసి నిప్పు పెట్టారు. తాము అష్టకష్టాలు పడి, అప్పులు చేసి మరీ ఇంత నాణ్యమైన మిర్చిని పండించి తీసుకువస్తే తమను దళారీలు ఈవిధంగా మోసం చేసి దోచుకొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంగతి తెలుసుకొని మార్కెట్ యార్డ్ కార్యదర్శులు జగన్, రామ్మోహన్ రెడ్డి అక్కడికి వచ్చి రైతులకు నచ్చజెప్పే ప్రయత్నాలు చేశారు. తరువాత అడ్తిదారులతో మాట్లాడారు. 

దేశంలో ఏ సంస్థ అయినా తాము ఉత్పత్తి చేస్తున్న వస్తువుల ధరలు స్వయంగా నిర్ణయించుకొంటాయి. కానీ రైతుల విషయంలో అందుకు భిన్నంగా దళారీలు వాటి ధరలు నిర్ణయిస్తుంటారు. రైతులకు నష్టమైనా వారు నిర్ణయించిన ధరలకే రైతులు తమ పంటలను అమ్ముకోవలసి రావడం చాలా దురదృష్టకరం. దళారీలు రైతులను దోచుకోకుండా కాపాడేందుకే ప్రభుత్వం మార్కెట్ యార్డులు ఏర్పాటు చేసింది. కానీ అక్కడా ఇదే పరిస్థితి ఎదుర్కోవలసి రావడం చాలా దురదృష్టకరం. మార్కెట్ యార్డు అధికారులు రైతుల పక్షాన్న నిలిచి వారికి మంచి ధర వచ్చేలాగ చేయనప్పుడు, ఇక వారెందుకు..మార్కెట్ యార్డులు ఎందుకు?


Related Post