లాభం వాళ్ళకి..భారం ప్రజలకి

March 24, 2017


img

తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో శాసనసభ స్థానాలు పెంచడానికి రెండు రాష్ట్రాలు తీవ్ర ఒత్తిడి చేస్తుండటంతో కేంద్రప్రభుత్వం అందుకు సిద్దం అవుతోంది. ప్రస్తుతం ఆంధ్రాలో 150 సీట్లు, తెలంగాణాలో 119 సీట్లు ఉన్నాయి. వాటిని వాటిని వరుసగా 225, 150కు పెంచడానికి తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయి. 

అయితే సీట్ల పెంపు వలన సామాన్య ప్రజలకు ఏమి ప్రయోజనం? అని ప్రశ్నించుకొంటే ఏమీ కనబడదు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలలో పనిచేసే ఉద్యోగులకు ఏటా జీతాలు పెరిగిన్నట్లుగానే, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జీతాలు కూడా ఏటా చాలా బారీగా పెంచుకుపోతున్నాయి మన ప్రభుత్వాలు. ఆ ఆర్ధికభారాన్ని కూడా సామాన్య ప్రజలే మోస్తున్నారు. ఇవి సరిపోవన్నట్లుగా అదనంగా మరో 40-50 మంది ఎమ్మెల్యేల సంఖ్య పెరిగితే వారి జీతభత్యాల భారం కూడా ప్రజలపైనే పడుతుంది. 

ప్రజలు ఇంత భారం భరించినా వారిలో ఎంతమంది చిత్తశుద్ధితో తమ నియోజకవర్గాల అభివృద్ధి కోసం పనిచేస్తున్నారు? తమకు ఓటేసి చట్టసభలకు పంపించిన సామాన్య ప్రజల కోసం ఏమి చేస్తున్నారు? అంటే ఏమీ కనబడదు. చాలా మంది ప్రజా ప్రతినిధులు తమ నియోజకవర్గంలోని ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండరు. చట్టసభలకు హాజరు కారు. ఒకవేళ హాజరైనా తమ నియోజకవర్గంలో సమస్యల గురించి నోరు విప్పి మాట్లాడే సాహసం చేయరు. ఎందుకంటే అక్కడ అధికార, ప్రతిపక్షాల మద్య రాజకీయయుద్దాలు జరుగుతుంటాయి కనుక దానిలో అందరికీ మాట్లాడే అవకాశం ఉండదు. ఉన్నా మాట్లాడకూడదు. 

ఇక ఈ శాసనసభ స్థానాల పెంపు వలన రాజకీయ పార్టీలకు మాత్రమే ఎక్కువ ఉపయోగపడతాయని వేరే చెప్పనవసరం లేదు. వాటి వలన ఎక్కువమంది రాజకీయ నిరుద్యోగులకు ‘ఎమ్మెల్యే ఉద్యోగాలు’ లభిస్తాయి. పార్టీలు ఫిరాయించిన ఎమ్మెల్యేలకు, అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్స్ దక్కే అవకాశాలు పెరుగుతాయి. ఎమ్మెల్యేల సంఖ్య పెరిగితే అదే నిష్పత్తిలో ఎమ్మెల్సీల సంఖ్య కూడా పెరుగుతుంది కనుక రాజకీయ నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు ఇంకా మెరుగవుతాయి. 

ప్రస్తుతం ఉన్న ప్రజా ప్రతినిధుల పనితీరే ఏమాత్రం సంతృప్తికరంగా లేదని స్వయంగా ముఖ్యమంత్రులే పెదవి విరుస్తున్నారు. ప్రజలు కూడా వారి పనితీరుపట్ల చాలా అసంతృప్తిగా ఉన్నారు. అయినా మరో 40-50 మంది ఎమ్మెల్యేలను పెంచుకోవడం సరికాదనే చెప్పక తప్పదు.


Related Post