కాబోయే సిఎంగారి తోఫాలు!

March 23, 2017


img

మన దేశంలో ప్రధానమంత్రి కావాలని కలలుకనేవారు..అలాగే గవర్నర్..ముఖ్యమంత్రి..మంత్రి..ఇలాగ వేర్వేరు లెవెల్స్ లో కలలు కంటున్నవారు కొన్ని వేలమంది ఉన్నారు. ఆ జాబితాలో లాల్ కృష్ణ అద్వానీ, లాలూ ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్, రాహుల్ గాంధీ, మాయావతి, ములాయం సింగ్, జానారెడ్డి, జగన్మోహన్ రెడ్డి వంటివారున్నారు. అయితే వారెవరూ కూడా జగన్మోహన్ రెడ్డిలాగ తమ మనసులో ఆరాటాన్ని బయటపెట్టుకోరు. జగన్ మాత్రం ఏ చిన్న అవకాశం వచ్చినా బయటపడిపోతుంటారు. ఈరోజు కూడా మళ్ళీ మరోమారు బయటపడ్డారు. 

అగ్రిగోల్డ్ బాధితుల నిరాహార దీక్ష శిభిరం వద్ద వారిని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “మీకోసం నేను చంద్రబాబుతో చాలా పోరాడాను. కానీ ఆయన చర్మం చాలా మందం కనుక నేను చెప్పే మాటలు అయన చెవికి ఎక్కుతాయని నేను అనుకోను. అయినప్పటికీ మీకోసం నేను ఆయనతో పోరాడుతూనే ఉంటాను. ఒకవేళ దానిలో నేను విజయం సాధించలేకపోయినా మీరేమీ బాధపడవద్దు. ఇప్పటికే మూడేళ్ళు గడిచిపోయాయి. మరో రెండేళ్ళు కళ్ళు మూసుకొని ఈ కష్టాలు, బాధలు భరిస్తే అనక ‘మన ప్రభుత్వమే’ అధికారంలోకి రాబోతోంది. నేను అధికారంలోకి రాగానే మీకు రావలసిన రూ.1,182 కోట్లు వారం రోజులలోనే విడుదల చేస్తాను. అలాగే అగ్రిగోల్డ్ భాదితులలో ఆత్మహత్యలు చేసుకొన్నవారి కుటుంబాలకు చంద్రబాబు ముష్టి మూడు లక్షలే ఇచ్చారు. నేను అధికారంలోకి రాగానే ఒక్కొక్కరికీ రూ.10 లక్షలు చొప్పున ఇస్తాను. మీకు ఆ డబ్బు పూవుల్లో పెట్టి అందిస్తాను,” అని వరాలు ప్రకటించేశారు. 

ఇంతకు ముందు రాజధాని రైతుల భూములను తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ దీక్ష చేసినప్పుడు వారికీ ఒక వరం ప్రకటించారు. తను అధికారంలోకి రాగానే ఎవరి భూములు వారికి అప్పగించేస్తానని. కానీ చంద్రబాబు నాయుడు ఆ భూములపై వేల కోట్లు ఖర్చు పెట్టి తాత్కాలిక సచివాలయం, శాసనసభ వరుసగా నిర్మించారు. అలాగే వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, విద్యా సంస్థలకు అక్కడ భారీ భవనాలు కట్టుకొంటున్నాయి. కనుక జగన్ ఇచ్చిన ఆ హామీలను నెరవేర్చాలంటే బాబు కట్టిన ఆ భవనాలను కూల్చివేయాలి. మిగిలిన రెండేళ్ళలో చంద్రబాబు సర్కార్ ఏమేమి చేస్తుందో..జగన్ ఇంకా ఎన్ని వరాలు ప్రకటిస్తారో చూడాలి. కానీ జగన్ బయటకు చెప్పని ఓ షరతు ఉంది అదేమిటంటే ఈ వరాలు కావాలనుకొంటే అందరూ ఆయనకే ఓట్లు వేసి ముఖ్యమంత్రిని చేసుకోవలసి ఉంటుంది. 


Related Post