భాజపా పోరాటం దేనికి?

March 22, 2017


img

ఉద్యోగాలలో ముస్లింలకు ప్రస్తుతం ఇస్తున్న 4 శాతం రిజర్వేషన్లను 12 శాతానికి పెంచడానికి వీలుగా ఈ శాసనసభ సమావేశాలలోనే ఒక బిల్లుని ప్రవేశపెడతామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించినప్పటి నుంచి భాజపా దానిని వ్యతిరేకిస్తూనే ఉంది. ముస్లిం ఓటు బ్యాంకును దృష్టిలో ఉంచుకొనే కేసీఆర్ ఈ ఆలోచన చేస్తున్నారని భాజపా నేతలు విమర్శిస్తున్నారు. ముస్లింలకు అదనంగా రిజర్వేషన్లు కల్పించడం కాకుండా ఇప్పుడు ఇస్తున్న ఆ 4 శాతాన్ని కూడా రద్దు చేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మన్ డిమాండ్ చేశారు. తమ పార్టీ మతపరమైన రిజర్వేషన్లకు వ్యతిరేకమని కనుక ఒకవేళ తెరాస సర్కార్ ముస్లిం రిజర్వేషన్ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టినట్లయితే దానిని తప్పకుండా అడ్డుకొంటామని చెప్పారు. దానిని జాతీయస్థాయిలో కూడా అడ్డుకొంటామని చెప్పారు. అంటే ఆ బిల్లును కేంద్రప్రభుత్వం ఆమోదం కోసం పంపినప్పుడు అక్కడ అడ్డుకొంటామని చెపుతున్నట్లే భావించవచ్చు. ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించడాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 24న భాజపా యువమోర్చ ఆధ్వర్యంలో ‘ఛలో అసెంబ్లీ’ ర్యాలీ కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. 

ముస్లిం ఓటు బ్యాంకును దృష్టిలో ఉంచుకొనే కేసీఆర్ ఈ ఆలోచన చేస్తున్నారని విమర్శిస్తున్న భాజపా నేతలు, ఈ బిల్లును గట్టిగా ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ఆలోచిస్తే వారు మెజార్టీ హిందువులను ఆకట్టుకోవడానికేనని అర్ధం అవుతుంది. గోవధ నిషేధం, అయోధ్యలో రామమందిరం నిర్మాణం వంటి ఆలోచనలన్నీ హిందూ ఓటు బ్యాంకును ఆకట్టుకోవడానికేనని వేరే చెప్పనవసరం లేదు. కనుక భాజపా స్వయంగా ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తూ తెరాస సర్కార్ ను విమర్శించడం చాలా హాస్యాస్పదంగా ఉంది. 


Related Post