మనసంతా పాకే..

March 22, 2017


img

‘మనసంతా పాకే..’అంటే మనసులో ప్రేమ పాకిందని కాదు..సినిమా పాట కూడా కాదు. ఆమె మనసు నిండా పాకిస్తాన్ పై ప్రేమ పాకి పేరుకుపోయిందని అర్ధం. ఆమె జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీ. 

ఆమె అనంతనాగ్ లో నిన్న ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “ప్రధాని నరేంద్ర మోడీ చాలా దమ్మున నాయకుడు. మన రాష్ట్రంలో నెలకొన్న అశాంతిని తొలగించగల సమర్ధత ఆయనకే ఉంది. ఇంతకు ముందు ప్రధానమంత్రిగా ఉన్న డాక్టర్ మన్మోహన్ సింగ్ పాక్ లో ఉన్న తన పూర్వీకుల గృహాన్ని చూసి వచ్చేందుకు ధైర్యం చేయలేకపోయారు. కానీ మోడీ ధైర్యంగా లాహోర్ వెళ్ళి వచ్చారు. కనుక ఆయన తక్షణం పాక్ ప్రభుత్వంతో మళ్ళీ చర్చలు ప్రారంభించి రాష్ట్రంలో శాంతియుత పరిస్థితులు నెలకొనేలా చేయాలి. ఇక్కడ రోడ్లు, విద్యుత్, నీళ్ళు వంటివాటి కంటే పాకిస్తాన్ తో సత్సంబంధాలు నెలకొల్పడం వలన ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది. అప్పుడే రాష్ట్ర ప్రజల మనసులకు అయిన గాయాలు మానుతాయి. సరిహద్దుకు అవతలి వైపు పాక్ అధీనంలో ఉన్న కాశ్మీర్ లో పాక్-చైనాలు కలిసి ఒక అంతర్జాతీయ రహదారిని నిర్మిస్తున్నాయి. దానితో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని అనుసంధానం చేయగలిగితే రాష్ట్రం చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఇవి నేను కొత్తగా చేస్తున్న డిమాండ్లు కావు. మా పిడిపి-భాజపాల మద్య పొత్తులు పెట్టుకొన్నప్పుడు చేసుకొన్న ఒప్పందంలో ఉన్నవే,” అని మహబూబా ముఫ్తీ అన్నారు. 

నేటికీ పాక్ ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్ లో తరచూ దాడులు చేస్తూనే ఉన్నారు. కాశ్మీర్ సరిహద్దుల వద్ద పాక్ సైన్యం భారత్ సైనికులపై కాల్పులు జరుపుతూనే ఉంది. కాశ్మీర్ లో జరిగిన అల్లర్లను కాశ్మీర్ స్వాతంత్ర పోరాటమని వాటికి తమ ప్రభుత్వం మద్దతు ఉంటుందని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ బహిరంగంగానే ప్రకటించారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో నిర్మిస్తున్న బారీ అంతర్జాతీయ రహదారిపై భారత్ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం చెపుతూనే ఉంది. కానీ భారత్ అభ్యంతరాలను అవి పట్టించుకోకుండా రోడ్డు నిర్మాణం చేస్తున్నాయి. అటువంటి ధూర్తదేశంతో మోడీ చర్చలు జరుపాలని, భారత్ వ్యతిరేకిస్తున్న ఆ రోడ్డుతో రాష్ట్రాన్ని అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రి ముఫ్తీ కోరడం గమనిస్తే ఆమె మనసులో పాక్ పట్ల ఎంత వెర్రి ప్రేమాభిమానాలున్నాయో అర్ధం చేసుకోవచ్చు. ఇంకా దురదృష్టకరమైన విషయం ఏమిటంటే అటువంటి వేర్పాటువాద పార్టీతో పొత్తులు పెట్టుకొని ఆ రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండేందుకు పాకిస్తాన్ తో చర్చలు జరుపుతామని భాజపా ఒప్పందం చేసుకోవడం! 


Related Post