అందుకే యోగికి ముఖ్యమంత్రి పదవి?

March 21, 2017


img

ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో భాజపా తన ముఖ్యమంత్రి అభ్యర్ధి పేరును ప్రకటించకుండానే వెళ్ళి   విజయం సాధించింది. ఆ తరువాత ముఖ్యమంత్రి పదవి ఎవరికీ దక్కుతుందనే దానిపై చాలా ఊహాగానాలు వినిపించాయి. అనూహ్యంగా ఆర్.ఎస్.ఎస్.నేతగా, హిందూ అతివాదిగా పేరు పడ్డ ఆదిత్యనాథ్ యోగిని ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టేసి అన్ని పార్టీలకు షాక్ ఇచ్చింది. అంటే ఎన్నికలకు ముందు నుంచే భాజపా అధిష్టానం చాలా ఆలోచించే అడుగులు వేసినట్లు స్పష్టం అవుతోంది. 

భాజపా, ఆర్.ఎస్.ఎస్.ల చిరకాల స్వప్నం అయోధ్యలో రామమందిరం నిర్మించడం. ఇప్పుడు కేంద్రంలో,   అయోధ్య ఉన్న యూపిలో భాజపా ప్రభుత్వం ఏర్పడింది. దానికి హిందూ అతివాదిగా ముద్రపడిన ఆదిత్యనాథ్ యోగి ముఖ్యమంత్రి అయ్యారు. కనుక అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి చాలా అనుకూలమైన పరిస్థితులు ఉనట్లే అర్ధం అవుతోంది. కనుక ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించి, 2019 ఎన్నికలలోగా అయోధ్యలో రామమందిరం నిర్మించగలిగితే, దేశంలో మెజార్టీ హిందువుల ఓట్లు భాజపాకే పడే అవకాశం ఉంటుంది. అప్పుడు మళ్ళీ భాజపా కేంద్రంలో...వీలైతే వివిధ రాష్ట్రాలలో కూడా అధికారం వచ్చే అవకాశాలు పెరుగుతాయ భాజపా (కేంద్రప్రభుత్వం) భావిస్తే ఆశ్చర్యం కాదు. 

బహుశః ఆ ఆలోచనతోనే ఆదిత్యనాథ్ యోగిని యూపి ముఖ్యమంత్రిగా నియమించి ఉండవచ్చు. యూపిలో భాజపా సర్కార్ కొలువయిన వెంటనే భాజపా ఎంపి సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ వేయడం చూస్తే కేంద్రప్రభుత్వం రామమందిరం నిర్మాణం కోసం కసరత్తు మొదలుపెట్టినట్లు అనుమానం కలుగుతోంది. ఒకవేళ కేంద్రప్రభుత్వం ముస్లిం పెద్దలను ఒప్పించి 2019 ఎన్నికలలోగా అయోధ్యలో రామమందిరం నిర్మించినట్లయితే ఇక భాజపాకు తిరుగు ఉండదు. ఈ ప్రయత్నాలలో భాజపా ఒకవేళ విఫలం అయినా కూడా అదే మాట చెప్పుకొని హిందువుల ఓట్లు సంపాదించుకోగలదు. 


Related Post