ఆ రాస్తాలో ఈజీగా డిల్లీ చేరుకోవచ్చుట!

March 21, 2017


img

కాంగ్రెస్ పార్టీ పతనం 2014 ఎన్నికలలో మొదలైంది. అది నేటికీ కొనసాగుతూనే ఉంది. ప్రతీ ఎన్నికలలో అది ఇంకా కుచించుకుపోతూనే ఉంది. అయినా ప్రజలు తమను పదేపదే ఎందుకు తిరస్కరిస్తున్నారు? తమ ఓటమికి కారణాలు ఏమిటి? పార్టీలో లోపం ఉందా..లేక తమ ప్రయత్నాలలోనే లోపం ఉందా? అని ఆత్మవిమర్శ చేసుకొని వాటిని సరిదిద్దుకొనే ప్రయత్నం చేయకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. 

తమ పార్టీకి బలమైన నాయకత్వం లేదనే సంగతి ఆ పార్టీలో అందరికీ తెలుసు. పార్టీ బ్రతికి ఉంటేనే దాని అధినేతకైనా, కార్యకర్తకైనా మనుగడ ఉంటుందని కాంగ్రెస్ పార్టీని నడిపిస్తున్న ఇద్దరు అధిష్టాన దేవతలకు కూడా బాగా తెలుసు. కానీ ఎట్టి పరిస్థితులలో పార్టీపై తమ కుటుంబం పట్టు వదులుకోవడానికి వారు ఇష్టపడకపోవడం చేత చిల్లుపడిన నౌకలా తమ పార్టీ మునిగిపోతున్నప్పటికీ దానిని తామే నడపాలనుకొంటున్నారు. ఆ కారణం చేతే పార్టీలో ఎవరూ వారిని తప్పుకోమని ధైర్యంగా చెప్పలేకపోతున్నారు. కాంగ్రెస్ పతనానికి ఇంకా అనేక కారణాలు ఉండవచ్చు కానీ ఇదే ప్రధానకారణం అని చెప్పవచ్చు. 

సోనియా, రాహుల్ గాంధీలను తప్పుకోమని ఎలాగూ ఎవరూ చెప్పలేరు కనుక కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడానికి ఆ పార్టీ నేతలు ప్రత్యామ్నాయ మార్గాలను ఆన్వేషిస్తుంటారు. ఆ ప్రయత్నంలోనే సోషల్ మీడియాను ఆశ్రయించాలని టిపిసిసి అధ్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. తమ పార్టీ సోషల్ మీడియాను సరిగ్గా ఉపయోగించుకోకపోవడం వలననే ప్రజలకు చేరువకాలేకపోతోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక నుంచి కేసీఆర్, మోడీ ప్రభుత్వాల అప్రజాస్వామిక విధానాలను, నిర్ణయాలను సోషల్ మీడియా ద్వారా ఎండగడుతూ ప్రజలకు చేరువవ్వాలని ఆయన పార్టీ నేతలకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. త్వరలోనే తెలంగాణా కాంగ్రెస్ పార్టీ అధికారిక వెబ్ సైట్ ను కూడా ప్రారంభిస్తామని ఉత్తం కుమార్ రెడ్డి చెప్పారు. 

ఇప్పుడు ఏ విషయమైన సోషల్ మీడియా ద్వారానే వేగంగా అందరికీ చేరుతోందని, దానిని సరిగ్గా వినియోగించుకోగలిగినట్లయితే 2019 ఎన్నికలలో మళ్ళీ కేంద్రంలో, రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి రాగలదని మాజీ ఎంపి మధు యాష్కీ అభిప్రాయం వ్యక్తం చేశారు. అక్కడ డిల్లీలో మోడీ, ఇక్కడ ఆంధ్రా, తెలంగాణా ముఖ్యమంత్రులు ఇద్దరూ కూడా ప్రజలను మాయమాటలు చెపుతూ మభ్యపెడుతున్నారని ఆరోపించారు. వారి తప్పులను సోషల్ మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేయవలసిన అవసరం ఉందని మధు యాష్కీ అభిప్రాయపడ్డారు.


Related Post