కాళేశ్వరానికి బ్రేకులు..తెరాస సర్కార్ ఎదురుదెబ్బే

March 21, 2017


img

తెరాస సర్కార్ చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రజలసంఘం బ్రేకులు వేసింది. కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టులను కొత్త ప్రాజెక్టులుగా చూపినట్లయితే పొరుగు రాష్ట్రంతో మళ్ళీ పేచీలు వస్తాయనే ఉద్దేశ్యంతో వాటిని పాతవిగానే చూపిస్తూ నివేదికలు రూపొందించి, వాటికి అనుమతులు కోరగా కేంద్ర జలసంఘం, గోదావరి బోర్డు సభ్యులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. 

తెరాస సర్కార్ వాదన ఇది:

ఉమ్మడి రాష్ట్రంలోనే అనుమతులు పొందిన ప్రాణహిత చేవెళ్ళలో భాగంగానే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించబడుతోంది. ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు ద్వారా సాగుచేయవలసిన ఆయకట్టుకు నీళ్ళు అందించడానికే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తునందున దానిని కొత్త ప్రాజెక్టుగా భావించడం సరికాదు. తుమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత లేనందునే గోదావరి నదిపై మేడిగడ్డ వద్ద బ్యారేజి నిర్మాణం చేపట్టవలసివస్తోంది. గోదావరి నదిలో నీటిని వాడుకొనే హక్కు తెలంగాణా రాష్ట్రానికి ఉంది కనుక దాని కోసం అవసరమైన చోట బ్యారేజిలు నిర్మించుకోవడం తప్పు కాదు. 

జలసంఘం అభ్యంతరాలు: 

ప్రాణహిత నది నీళ్ళపై ఆధారపడి ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టును రూపొందిస్తే, కాళేశ్వరం ప్రాజెక్టు గోదావరి నీళ్ళపై ఆధారపడి నిర్మించబడుతోంది. నది బేసిన్ మారినప్పుడు అది మరో కొత్త ప్రాజెక్టు క్రిందే పరిగణించబడుతుంది తప్ప పాతదానిగా కాదు. ఉమ్మడి రాష్ట్రంలోనే అనుమతులు పొందిన ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టులో మేడిగడ్డ వద్ద బ్యారేజి లేదు. కనుక అది కొత్తదే. రీ డిజైనింగ్ పేరుతో ప్రాజెక్టుల అంచనాలు పెంచడం, ఇదివరకు అనుమతించిన నిర్దేశిత స్థలంలో కాకుండా వేరే చోట ప్రాజెక్టు నిర్మాణానికి పూనుకోవడం, నీటి వాడకం పెంచుకోవడం, ఈ పనులకు ముందస్తుగా ఎటువంటి అనుమతులు తీసుకోకపోవడం తప్పు. 

కనుక మళ్ళీ ఈ ప్రాజెక్టులపై తాము లేవనెత్తిన ప్రశ్నలకు సంతృప్తికరమైన వివరణలు సమర్పించవలసిందిగా కేంద్ర జలసంఘం, గోదావరి బోర్డు సభ్యులు తెరాస సర్కార్ ను ఆదేశించారు. 

కేంద్ర జలసంఘం లేవనెత్తిన ఈ అభ్యంతరాల వలన ఈ ప్రాజెక్టు నిర్మాణం ఇంకా ఆలశ్యం కావడం ఒక సమస్యకాగా, ఈ విషయంలో మొదటి నుంచి తీవ్ర అభ్యంతరాలు, విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలు మళ్ళీ దాడి ప్రారంభిస్తే వాటిని ఎదుర్కోవడం తెరాస సర్కార్ మరో పెద్ద సమస్య. ఇవి కాక భూసేకరణపై కోర్టులలో కేసులు ఉండనే ఉన్నాయి.  ఈ పరిస్థితులలో తెరాస సర్కార్ ఏవిధంగా ముందుకు సాగుతుందో వేచి చూడాలి.  


Related Post