చంద్రబాబుకు నోటీసు?

March 21, 2017


img

ఓటుకు నోటు కేసులో వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ సుప్రీంకోర్టు ఏపి సిఎం చంద్రబాబు నాయుడుకు నోటీస్ పంపిన సంగతి తెలిసిందే. ఈరోజు ఆయన మరో నోటీస్ అందుకోబోతున్నారు. అయితే అది అంత ఆందోళన కలిగించేది కాదు. ఎందుకంటే, శాసనసభలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైకాపా దానిని ఇవ్వబోతోంది. 

ఏపి శాసనసభలో నిన్న గవర్నర్ నరసింహన్  ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చలో ముఖ్యమంత్రి చంద్రబాబుపై జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ సమయంలో స్పీకర్ జగన్ మైకును కట్ చేయడంతో వైకాపా సభ్యులు స్పీకర్ పోడియంను చుట్టుముట్టి నిరసనలు తెలియజేస్తూ నినాదాలు చేశారు. అప్పుడు చంద్రబాబు నాయుడు వారిని ఉద్దేశ్యించి “జగన్ కు రూల్స్ తెలియవు. వైకాపా ఎమ్మెల్యేలకు అసాలు ఏమీ తెలియదు. మేము ఏదనుకొంటే అది జరగాలని పట్టుబడుతూ సభలో అలగా జనం (లేబర్ క్లాస్) లాగ గలాటా చేస్తున్నారు,” అని అన్నారు. 

గౌరవనీయమైన ప్రజా ప్రతినిధులనుద్దేశ్యించి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిధంగా చులకనగా మాట్లాడినందుకు, ఇవ్వాళ జరుగబోయే శాసనసభ సమావేశాలలో వైకాపా చంద్రబాబు నాయుడుపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసును ఇవ్వాలని నిర్ణయించింది. 

అయితే దీని వలన తెదేపా, వైకాపాల మద్య మరింత తీవ్ర స్థాయిలో వాగ్వాదాలు జరుగడమే తప్ప మరే ప్రయోజనం ఉండదని చెప్పవచ్చు. జగన్మోహన్ రెడ్డిని రెచ్చగొట్టినట్లయితే ఆయన ఆవేశంలో తప్పులు చేస్తుంటారని తెదేపా ఎప్పుడో కనిపెట్టింది. కనుక వైకాపా ఇవ్వబోయే నోటీసులను చూసి తెదేపా నేతలు చాలా సంతోషించవచ్చు. 

చంద్రబాబుకు దమ్ముంటే తెదేపాలోకి ఫిరాయించిన వైకాపా ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి ఎన్నికలు ఎదుర్కోవాలని జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వనందుకు నిరసనగా జగన్ తన పార్టీ ఎంపిల చేతే రాజీనామాలు చేయిస్తానని ప్రకటించి ఉన్నారు కనుక వారిచేత రాజీనామాలు చేయించమని జగన్మోహన్ రెడ్డిని తెదేపా సభ్యులు రెచ్చగొట్టవచ్చు. ఒకవేళ జగన్ ఆవేశంలో దానికి అంగీకరిస్తే వైకాపాలో ముసలం పుట్టడం ఖాయం. అదే కనుక జరిగితే జగన్ తెదేపాను దెబ్బ తీయబోయి తన పార్టీనే దెబ్బ తీసుకొన్నట్లవుతుంది.


Related Post