భాజపా ఎమ్మెల్యే రాజీనామా?

March 21, 2017


img

హైదరాబాద్, ఘోషా మహల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న భాజపా ఎమ్మెల్యే రాజా సింగ్ మళ్ళీ వార్తలలోకి వచ్చారు. ధూల్ పేట్ లో గుడంబా తయారుచేసి అమ్ముకొంటున్న నిరుపేద ప్రజల సమస్యలను తెరాస సర్కార్ తక్షణమే పరిష్కరించాలని కోరుతూ ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ కు సోమవారం ఒక లేఖ వ్రాశారు. వారికి ఎటువంటి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గం చూపించకుండానే తెరాస సర్కార్ గుడంబా తయారీపై నిషేధం విధించడంతో వారు రోడ్డున పడ్డారని, వారిలో కొంతమంది ఆర్ధిక సమస్యలను తట్టుకోలేక ఆత్మహత్యలు కూడా చేసుకొంటున్నారని రాజా సింగ్ తన లేఖలో వ్రాశారు. కనుక ముఖ్యమంత్రి కేసీఆర్ తక్షణమే ధూల్ పేటలో పర్యటించి గుడంబా నిషేధం వలన తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్న నిరుపేద ప్రజలను ఆదుకోవాలని కోరారు. ఒకవేళ ప్రభుత్వం తక్షణం స్పందించకుంటే, ప్రభుత్వ వైఖరికి నిరసనగా వ్రాస్తున్న తన ఈ లేఖనే రాజీనామా లేఖగా భావించవలసిందిగా కోరారు.

ధూల్ పేటవాసుల సమస్యలను రాజా సింగ్ ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం చాలా అభినందనీయమే. ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే ఆయన భాజపాతో సహా అన్ని పార్టీల మద్దతు కూడగట్టుకొని ధూల్ పేట వాసుల సమస్యల పరిష్కారం అయ్యే వరకు ప్రభుత్వంతో గట్టిగా పోరాడితే చాలా బాగుండేది కానీ రాజీనామా చేయాలనుకోవడం విచిత్రంగా ఉంది. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసమే వారిని తమ ప్రతినిధులుగా ఎన్నుకొంటారు. కానీ వారు ఆ పని చేయలేక రాజీనామా చేస్తే అప్పుడు ప్రజలు ఏమనుకోవాలి? ఎవరికి మోర పెట్టుకోవాలి? 


Related Post