జర మా దిక్కు కూడా సూడుండ్రి!

March 20, 2017


img

మాజీ రాజ్యసభ సభ్యుడు సీనియర్ కాంగ్రెస్ నేత వి హనుమంతరావు సోమవారం మీడియాను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “రాష్ట్రంలో తెరాస తప్ప మరో పార్టీయే లేదన్నట్లుగా మీడియా వాళ్ళు అందరూ దానికే భజన చేస్తున్నారు. ఎందులో చూసినా..ఎప్పుడు చూసినా కేసీఆర్.. కేటిఆర్..కవితమ్మ..హరీష్ రావుల గురించే వార్తలు కనబడుతుంటాయి. వాళ్ళు నలుగురే ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించేస్తున్నారన్నట్లు ఓ..ఒకటే పొగడ్తలు..రాష్ట్రంలో ప్రతిపక్షాలు కూడా ఉన్నాయనే సంగతి మా మీడియా మిత్రులకు గుర్తుందో లేదో.. మేము కూడా ప్రజా సమస్యల గురించి మాట్లాడుతున్నాము కదా! రాష్ట్రంలో మేము కూడా ఉన్నాము కనుక మీ మైకులు, కెమెరాలు జర మా దిక్కు కూడా తిపుండ్రి..” అని అన్నారు. 

హనుమంతరావు మాటలు కాస్త నవ్వు కలిగిస్తున్నా వాటిలో నిజం, ఆవేదన కనబడుతోంది. ఒక్క తెలంగాణాలోనే కాదు దేశంలో ఏ రాష్ట్రంలోనైనా సరే ప్రభుత్వాన్ని లేదా అధికార పార్టీని విమర్శించాలంటే కొంచెం ఆలోచించుకోవలసిన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలు కూడా పార్టీలు, కులాలు, మతాలు, ప్రాంతాలు, బాషలవారిగా విడిపోయారు కనుక ఏ పార్టీని వేలెత్తి చూపించినా ఎవరో ఒకరికి కోపం వస్తుంది. అవినీతిపరులు, అసమర్ధులు, క్రిమినల్ రికార్డులున్న వారిని కూడా ప్రజలు క్షమించేస్తున్నారు కానీ ఒక పార్టీనో, ప్రభుత్వాన్నో విమర్శించినా, వాటి తప్పులు ఎత్తి చూపినా మీడియాను క్షమించలేకపోతున్నారు. కనుక మీడియా కూడా అందరినీ శత్రువులు చేసుకొని సమస్యలు ఎదుర్కోవడం ఎందుకనే ఆలోచనతో ఏదో ఒక పార్టీ సైడ్ తీసుకోవడం అలవాటు చేసుకొంటోంది. ముఖ్యంగా అధికార పార్టీ దాని ప్రభుత్వానికి బాకాలు ఊదడం అలవాటుగా మార్చేసుకొంటోంది. ఉదాహరణకు మొన్న ఏపి, తెలంగాణా సర్కారులు ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ల గురించి యావత్ మీడియా “నభూతో నభవిష్యత్” అని వర్ణించి పడేసింది. కానీ వాస్తవాలు ఏమిటో ప్రతిపక్షాలు చెపుతున్నాయి. 

ఒక తప్పు లేదా సమస్యను గుర్తించి ప్రజలను, ప్రభుత్వాలను అప్రమత్తం చేయవలసిన మీడియా ప్రజలకు, ప్రభుత్వ ఒత్తిళ్ళకు భయపడి ఈ విధంగా వ్యవహరిస్తుండటం వలన వాస్తవ పరిస్థితులను, సమస్యలను చాప క్రింద దాచిపెట్టేసుకొంటున్నట్లు అవుతోంది. దాని వలన రాజకీయ పార్టీలు ఏమీ నష్టపోవు...రాష్ట్రాలు..ప్రజలే నష్టపోతారు. కనుక మీడియాలో కనబడే నిజాయితీని ప్రజలు కూడా గుర్తించి ఆమోదించి ప్రోత్సహించడం చాలా అవసరం. 


Related Post