కోమటిరెడ్డీ ఏందిది?

March 20, 2017


img

కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అప్పుడప్పుడు టిపిసిసి అధ్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డిపై విమర్శలు గుప్పిస్తుంటారు. నిన్న సరూర్ నగర్ లో వామపక్షాలు బారీ బహిరంగసభ నిర్వహించడం చూసిన తరువాతైన కాంగ్రెస్ పార్టీ మేల్కొనవలసి ఉందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. 

తెరాస సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు జూన్ 2న హైదరాబాద్ లో ఒక బారీ బహిరంగ సభ నిర్వహించాలనుకొంటున్నట్లు ఆయన చెప్పారు. ఆ సభకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలను ఆహ్వానించాలనుకొంటున్నట్లు చెప్పారు. ఈ సభ నిర్వహించవలసిందిగా పిసిసిపై ఒత్తిడి తెస్తానని అన్నారు. ఒకవేళ అది అందుకు సిద్దం కాకపోయినట్లయితే తానే స్వయంగా నల్లగొండలో బారీ బహిరంగ సభ నిర్వహిస్తానని వెంకటరెడ్డి చెప్పారు. 

సాధారణంగా ఇటువంటి నిర్ణయాలు, ప్రకటనలు పిసిసి కార్యవర్గం చేస్తుంది. కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన నిర్ణయం ప్రకటించేసి దానిని పిసిసి అమలుచేయాలని కోరుతుండటం విశేషం. ఒకవేళ పిసిసి అందుకు అంగీకరించకపోతే నల్లగొండలో ఆ సభను నిర్వహించుకొంటానని చెప్పడం గమనిస్తే పిసిసి నిర్ణయంతో తనకు సంబంధం లేదన్నట్లుంది. 

వచ్చే ఎన్నికలలో తెరాస సర్కార్ ను, దానిని నడిపిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ను తప్పకుండా ఓడిస్తామని కాంగ్రెస్ నేతలు గొప్పలు చెప్పుకొంటున్నారు. కానీ వాళ్ళలో వాళ్ళే ఈవిధంగా ఒకరినొకరు ఓడించుకొని పార్టీలో పైచెయ్యి సాధించే ప్రయత్నాలు చేస్తున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన ఈ తాజా ప్రకటనలో పిసిసి, దాని అధ్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీని పట్టించుకోవడంలేదనే అభిప్రాయం స్పష్టంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ నేతలే తమ అసమర్ధతను ఈవిధంగా చాటుకొంటున్నప్పుడు మళ్ళీ తెరాసను ఏవిధంగా ఓడించగలమని కలలు కంటున్నారో వారికే తెలియాలి.  



Related Post