లాల్..నీల్ ఐఖ్యత సాధ్యమేనా?

March 20, 2017


img

మనదేశ రాజకీయాలలో “మమ్మల్ని ప్రశ్నించే నైతిక హక్కు మీకు లేదు..చట్టం తన పని తను చేసుకుపోతుంది..కోర్టు తీర్పు కాపీ ఇంకా అందలేదు..ఆత్మపరిశీలన చేసుకొంటాం” వంటి పడికట్టు పదాలను తరచూ వింటుంటాము. అటువంటి మరో పదమే ‘వామపక్షాల ఐక్యత.’ సాధారణంగా ఎన్నికలకు ముందు ఇది వినిపిస్తుంటుంది. ఆదివారం హైదరాబాద్ లో జరిగిన సిపిఐ(ఎం) సమర సమ్మేళన బహిరంగసభ సందర్భంగా మరోమారు ఆ మాట వినిపించింది. అన్ని ఎరుపు రంగుజెండాలు కట్టకట్టి, వాటికి నీలంరంగు అంచు వేద్దామనే సరికొత్త ప్రతిపాదన చేశారు. అంటే బీసిలు, దళితులు, గిరిజనుల కోసం పోరాడుతున్న సంఘాలు, పార్టీలతో కలిసి పనిచేద్దామని అర్ధం. 

దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటికి నుంచి వామపక్షాలు ఉన్నాయి. ప్రజా సమస్యలపై పోరాడటంలో వాటికవే సాటి. నిజం చెప్పాలంటే వాటి ముందు అన్ని రాజకీయ పార్టీలు తీసికట్టే. అయినా ఒకటి రెండు రాష్ట్రాలలో తప్ప వామపక్షాలు ఎక్కడా అధికారంలోకి రాలేకపోయాయి. ఉన్న రెండిటిలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని మమతక్క చేతిలోకి వెళ్ళిపోవడంతో ఇప్పుడు ఎర్రజెండాలు కేరళకు మాత్రమే పరిమితం అయిపోయాయి.

ఇక తెలంగాణాలో ప్రతిపక్ష పార్టీలన్నీ తెరాస దెబ్బకు డీలా పడిపోవడంతో రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయ శూన్యతను భర్తీ చేయాలనే ఆలోచనతో సిపిఐ(ఎం) తమ్మినేని వీరభద్రం కాళ్ళు అరిగిపోయేలా 4,100 కిమీ పాదయాత్ర చేశారు. మరి దానితో ఆ పార్టీకి ఏమైనా ప్రయోజనం కలుగుతుందా లేదా అనేది ఎన్నికలు వస్తేనే గానీ తెలియదు. కానీ పాదయాత్ర ముగింపు సందర్భంగా హైదరాబాద్ లో నిన్న నిర్వహించిన సభలో వామపక్షాలు చేసిన ‘లాల్-నీల్’ ఐక్యపోరాటాలనే కొత్త ప్రతిపాదన మంచి ఆలోచనే అని చెప్పవచ్చు. కానీ ముందే చెప్పుకొన్నట్లు పడికట్టు పదం వంటి ‘వామపక్షాల ఐక్యత’ ఆచరణ సాధ్యమేనా? మళ్ళీ వాటితో ‘నీల్ పార్టీలు’ కలిసి పనిచేయడం సాధ్యమేనా? అనే సందేహాలు కలుగుతాయి. ఒకవేళ ఈ ఆలోచనను ఆచరణలో పెట్టి బలహీనవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంఘాలు, పార్టీలతో వామపక్షాలు చేతులు కలిపి ఎన్నికలకు వెళితే మంచి ఫలితాలే ఆశించవచ్చు.


Related Post