జగన్ ఇప్పుడే గెలువలేకపోతే మరి...

March 20, 2017


img

వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తరచూ చెప్పే మాట “మరో రెండేళ్ళలో ఏపిలో తమ పార్టీ అధికారంలోకి రాబోతోందని..తనే రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతున్నానని!” 

అలాగే చంద్రబాబు నాయుడికి దమ్ముంటే తెదేపాలోకి ఫిరాయించిన వైకాపా ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించి తక్షణం ఎన్నికలు జరుపాలని, అప్పుడు ఎవరి సత్తా ఏమిటో తేలిపోతుందని సవాలు విసురుతుంటారు. నేడు వెలువడిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలలో తన కంచుకోట కడపతో సహా వైకాపాకు గట్టి పట్టున్న నెల్లూరు, కర్నూలు జిల్లాలలో కూడా వైకాపా అభ్యర్ధులు ఓడిపోయారు. కంచుకోటవంటి తన కడప జిల్లాలోనే తన అభ్యర్ధిని జగన్ గెలిపించుకోలేనప్పుడు ఇంక అసెంబ్లీ ఎన్నికలలో ఏవిధంగా గెలిపించుకోగలరు? అనే సందేహం కలగడం సహజం. 

ఈ ఎన్నికల ఫలితాలపై జగన్ స్పందిస్తూ, “ఈ ఎన్నికలలో మా పార్టీ ఓడిపోయినప్పటికీ నైతికంగా మేమే గెలిచాము. తెదేపా మంత్రులు, ఎమ్మెల్యేలు నియోజక వర్గాలలో తిష్టవేసి మా పార్టీ ఎంపిటిసిలను ప్రలోభపెట్టి...లొంగకపోతే బెదిరించి, భయపెట్టి లొంగదీసుకొన్నారు. చంద్రబాబు నాయుడు ఇతర పార్టీల నేతలను, కార్యకర్తలను కొనుగోలు చేయడంలో ఆరితేరిపోయారు. డబ్బుతో కొనుగోలు చేసి సాధించిన విజయం కూడా ఒక విజయమేనా?” అని జగన్ ప్రశ్నించారు.

జగన్ చెప్పింది అక్షరాల నిజమే కావచ్చు. 2014 ఎన్నికలలో కూడా చంద్రబాబు ఈవిధంగానే ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారని జగన్ చాలాసార్లు ఆరోపిస్తుంటారు. దీనినే మరోవిధంగా చెప్పుకొంటే తెదేపా ఏదోవిధంగా ఎన్నికలలో గెలువగలదని జగన్ ఒప్పుకొంటున్నట్లుంది. ఒకవేళ అదే నిజమనుకొంటే, ఎమ్మెల్సీ ఎన్నికలలోనే గెలిచిన తెదేపా వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో మాత్రం గెలువలేదా? అనే సందేహం కలుగుతుంది. 

జగన్ తరచూ చెప్పే మరో మాట “న్యాయం, ధర్మం పైన ఆ దేవుడు, క్రిందన ప్రజలు అందరూ మనవైపే ఉన్నారని!” ఈ ఎన్నికల ముందు కూడా మరోమారు అదే ముక్కలు చెప్పి ‘వైకాపా విజయం తధ్యం’ అని బల్లగుద్ది వాదించారు. అదే జగన్ ఇప్పుడు ‘చంద్రబాబు చీటింగ్ చేసి గెలిచాడు..’ అని వాదిస్తున్నారు. 

ఎన్నికలలో చీటింగ్, కొనుగోలు చేయడంలో చంద్రబాబు ఆరితేరిపోయాడని జగన్ ఒప్పుకొంటున్నప్పుడు, అటువంటి వ్యక్తిని, పైగా అధికారంలో ఉన్న తెదేపాను 2019 అసెంబ్లీ ఎన్నికలలో వైకాపా ఏవిధంగా ఓడించి అధికారం చేజిక్కించుకోగలదని జగన్ జోస్యం చెపుతున్నారు? అనే సందేహం వైకాపా నేతలకు కలిగితే ఆ పార్టీకి ప్రమాదమే! 


Related Post