సంగీతంలో ఇవేం అపశ్రుతులు?

March 20, 2017


img

ప్రముఖ నేపద్య గాయకుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాలు కలిసి కొన్ని వేలపాటలు చేశారు. ఇప్పుడు వారిరువురు మద్య గొడవ మొదలవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. 

తాను సంగీతం సమకూర్చిన పాటలపై తనకే కాపీ రైట్ హక్కులు ఉన్నందున వాటిని బాలసుబ్రహ్మణ్యం లేదా అయన కుమారుడు చరణ్ లేదా మరెవరూ సంగీత కార్యక్రమాలలో పాడకూడదని, పాడినట్లయితే చట్టపరంగా చర్యలు తీసుకోవలసి వస్తుందని హెచ్చరిస్తూ ఇళయరాజా వారికీ, నేపద్యగాయిని చిత్రకూ నోటీసులు పంపించారు. దీనిని బాలసుబ్రహ్మణ్యం స్వయంగా ద్రువీకరించడమే కాకుండా దానిపై ఫేస్ బుక్ ద్వారా తన స్పందనను తెలియజేశారు.  

“ఇళయరాజా గారి నుంచి మా అందరికీ నోటీసులు అందాయి. మా ‘ఎస్.పి.బి.50’ కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు మేము రష్యా, శ్రీలంక, మలేసియా, సింగపూర్‌, దుబాయ్ మొదలైన అనేక దేశాలలో పాటలు పాడాము. కానీ అప్పుడు ఇళయరాజాగారు ఎటువంటి అభ్యంతరం చెప్పలేదు. గతవారం అమెరికాలో మా పర్యటన సాగుతున్నప్పుడు మాకు ఆయన నుంచి నోటీసులు అందాయి. ఇలాగ ఎందుకు జరిగిందో మాకు తెలియదు. ఆయన సూచించినట్లే ఇకపై మా కార్యక్రమాలలో అయన సంగీతం సమకూర్చిన పాటలు పాడబోము. చట్ట ప్రకారం ఆయన మాకు నోటీసులు పంపారు కనుక వాటికి జవాబు పంపవలసిన భాద్యత మాపై ఉంది కనుక త్వరలోనే జవాబు పంపుతాము. దయచేసి ఈ సమస్యను పెద్దది చేయవద్దని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను,” అని బాలసుబ్రహ్మణ్యం ఫేస్ బుక్ లో మెసేజ్ పెట్టారు.  

ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చరణ్, చిత్ర తదితరులు ‘ఎస్.పి.బి.50’ అనే పేరుతో గత ఏడాది ఆగస్ట్ నుంచి వివిధ దేశాలలో సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వారం రోజుల క్రితం లాస్ ఏంజెల్స్, సియాటిల్ లో సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పుడు వారికి ఇళయరాజా నుంచి ఈ నోటీసులు అందాయి. 

ఇళయరాజా ఈవిధంగా ఎందుకు నోటీసులు పంపారో తెలియదు కానీ తాను సంగీతం సమకూర్చిన పాటలపై తనకే కాపీ రైట్ హక్కులు కలిగి ఉంటాయని చెప్పడం శోచనీయం. నిజానికి ఒక సినీ నిర్మాత పెట్టుబడి పెట్టి సినిమా తీస్తున్నప్పుడు, ఒక రచయిత ఆ పాటలను వ్రాస్తాడు. దానికి సంగీత దర్శకుడు బాణీలు సమకూరుస్తాడు. వాటిని నేపధ్య గాయకులు పాడుతారు. వాటిని నటీనటులు తమ నటనతో రక్తి కట్టిస్తారు. కెమెరా మెన్ తెర మీద ఒక దృశ్యకావ్యంగా ఆవిష్కరిస్తాడు. ఆ పాటలను ఆడియో రికార్డుల రూపంలో మ్యూజిక్ కంపెనీలు ప్రజలకు అందుబాటులోకి తెస్తాయి. ఈవిధంగా ఒక నిర్మాత సినీ నిర్మాణ ఆలోచనతో మొదలయ్యే పాట ఒక రచయిత మనసులో నుంచి కాగితం మీదకు...సినిమా తెర మీదకు రావడానికి ఎంతో మంది సమిష్టి కృషి ఉంటుంది. ఒక పాట వెనుక ఇంతమంది కృషి ఉన్నప్పుడు అది నాకే స్వంతం అని ఇళయరాజా వంటి ప్రముఖ సంగీత దర్శకుడు చెప్పుకోవడం విచిత్రంగానే ఉంది. అందరూ ఆయనలాగే ఆలోచిస్తే ఇక ఎవరూ పాటలు వినే అవకాశమే ఉండదు. 


Related Post