జీవన్ రెడ్డి మీకిది తగునా?

March 18, 2017


img

సింగరేణి వారసత్వ ఉద్యోగాల విషయంలో నిర్ణయం తీసుకోవడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ రెండేళ్ళు ఆలస్యం చేసినందునే ఇప్పుడు దాని అమలుకు ఆటంకం ఏర్పడిందని కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి విమర్శించారు. సింగరేణి ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కేసీఆర్ తమ రాజకీయ లబ్ది గురించి మాత్రమే ఆలోచిస్తూ 2014లో తీసుకోవలసిన నిర్ణయాన్ని రెండేళ్ళ తరువాత 2016లో తీసుకొన్నారని విమర్శించారు. ఈ కేసులో తెరాస సర్కార్ చాలా అసమర్ధంగా వ్యవహరించడం వలననే హైకోర్టు తీర్పు ఆవిధంగా వచ్చిందని అన్నారు. కనీసం సుప్రీంకోర్టులోనైనా ఈ కేసును సరిగ్గా వాదించాలని తెరాస సర్కార్ కు జీవన్ రెడ్డి హితవు పలికారు. ఈ వ్యవహారంలో జరిగిన పొరపాట్లకు ముఖ్యమంత్రి కేసీఆర్ నైతిక బాధ్యత వహించాలని జీవన్ రెడ్డి అన్నారు.

సింగరేణి కార్మికులు గత రెండు దశాబ్దాలుగా ఈ వారసత్వ ఉద్యోగాల కోసం ప్రభుత్వాన్ని అడుగుతున్నారు. పదేళ్ళు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏనాడూ వారి గోడును పట్టించుకోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం ఆలోచించడానికి కూడా ఇష్టపడని పనిని ముఖ్యమంత్రి కేసీఆర్ మానవతా దృక్పధంతో చేస్తే ఆయనను అభినందించకపోగా కాంగ్రెస్ నేతలు ఇటువంటి నీచమైన ఆరోపణలు చేయడం చాలా శోచనీయం.

కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో తెరాస మొట్టమొదటిసారిగా అధికారం చేపట్టినప్పుడు మొదటి సంవత్సరంలో ఎన్ని సమస్యలు ఎదుర్కొందో కాంగ్రెస్ నేతలతో సహా అందరూ కళ్ళారా చూశారు. రాష్ట్రాన్ని మళ్ళీ గాడిన పెట్టడానికి తెరాస సర్కార్ ఎన్ని చర్యలు చేపట్టిందో అందరూ చూస్తూనే ఉన్నారు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వాలు సమస్యలను అర్ధం చేసుకొని వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టడానికి ఆ మాత్రం సమయం పట్టడం సహజం. కాంగ్రెస్ నేతలకు ఇవన్నీ తెలిసినా తెలియనట్లు నటిస్తూ కేసీఆర్ చేసిన పనిని తప్పు పడుతున్నారు.

ప్రజలు కాంగ్రెస్ పార్టీని పదేపదే ఎందుకు తిరస్కరిస్తున్నారో గ్రహించకుండా, తమకు అలవాటైన మూస పద్ధతిలోనే కుళ్ళు రాజకీయాలు చేస్తూ అదే సరైనది గొప్పది అనే భ్రమలో బ్రతుకుతున్నారు. తెలంగాణాలో కూడా ఇదే విధంగా వ్యవహరిస్తే కాంగ్రెస్ పార్టీని ఏ 'బాహుబలి' కాపాడలేడని కాంగ్రెస్ నేతలు గ్రహిస్తే మంచిది. 


Related Post