తూచ్...ఆ రుణాలు మేము తీర్చం!

March 18, 2017


img

యూపి రైతుల పంట రుణాల మాఫీ భారాన్ని కేంద్రప్రభుత్వమే భరిస్తుందని కేంద్ర ఆహారశాఖా మంత్రి రాధామోహన్ సింగ్ పార్లమెంటులో చేసిన ప్రకటనపై రెండు తెలుగు రాష్ట్రాల నేతల స్పంధన చూసి కేంద్రం మాట మార్చింది,. కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు మీడియాతో మాట్లాడుతూ, “యూపిలో రైతుల రుణాలను అక్కడి ప్రభుత్వమే మాఫీ చేస్తుంది. ఆ ఆర్ధిక భారాన్ని అదే భరిస్తుంది. దాని కోసం కేంద్రప్రభుత్వం నిధులు అందించదు. దీనిపై ఎవరూ అనవసరమైన అనుమానాలు, అపోహలు పెంచుకొని కేంద్రప్రభుత్వాన్ని నిందించడం సరికాదు. కేంద్రప్రభుత్వం ఎప్పుడూ ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాలని వేర్వేరుగా చూడలేదు. చూడదు కూడా. మా ప్రభుత్వానికి దేశంలో అన్ని రాష్ట్రాలు సమానమే,” అని అన్నారు. 

అయితే ఈ వ్యవహారం కేంద్రానికి మరొక కొత్త సమస్యగా తయారుకాకూడదనే ఆలోచనతోనే వెంకయ్య నాయుడు ఈ సవరణ ప్రకటన చేసి ఉండవచ్చు. దీని గురించి అందరూ మరిచిపోయిన తరువాత దానికి కేంద్రప్రభుత్వం నిధులు అందించడం ఖాయం. ఎందుకంటే, యూపిలో ఏర్పడబోయేది భాజపా ప్రభుత్వమే. పైగా 2019 సార్వత్రిక ఎన్నికలలో విజయం సాధించి మళ్ళీ కేంద్రంలో అధికారంలోకి రావాలంటే అదే యూపి ప్రజల ఓట్లు పొందవలసి ఉంటుంది. కనుక వారిని ప్రసన్నం చేసుకొనేందుకు మిగిలిన ఈ రెండేళ్ళలో కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ఎంత ఆర్ధిక భారమైన భరించడానికి సిద్దపడవచ్చు. కానీ ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలలో భాజపా స్వయంగా అధికారంలోకి వచ్చే అవకాశం లేదు కనుక రెండు రాష్ట్రాల కోసం కేంద్రప్రభుత్వం ఎక్కువగా ఆలోచించనవసరం లేదు. ఇది చేదు నిజం. అంగీకరించక తప్పదు.  


Related Post